తెలంగాణ సీఎస్ పదవిని క్యాడర్ మార్పుపై వచ్చిన తీర్పుతో రాత్రికి రాత్రి కోల్పోయిన సోమేష్ కుమార్ కేంద్రం ఆదేశించినట్లుగా వచ్చి ఏపీలో రిపోర్టు చేశారు. రిపోర్టు చేసిన తర్వాత సీఎస్ జవహర్ రెడ్డి ఆయనను తీసుకుని సీఎం జగన్ వద్దకు వెళ్లారు. దాదాపుగా గంట సేరు జగన్తో వారు చర్చించారు. సోమేష్ ఇప్పటి వరకూ ఏపీలో తనకు ప్రాధాన్యత దక్కదని.. ఏదో చిన్న పోస్టు కేటాయిస్తే అంతకంటే అవమానం ఉండదని అనుకుంటున్నారు. అయితే జగన్ తో జరిగిన భేటీలో.. సీఎస్ పోస్టు కాదు కానీ గౌరవంగా చూస్తామన్న హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.
సోమేష్ కు ఇంకా పదకొండు నెలలు మాత్రమే పదవీ కాలం ఉంది. ఇప్పుడు రాజీనామా చేసి తెలంగాణ ప్రభుత్వంలో సలహాదారుగా చేరితే.. ఎన్నికలు తొమ్మిది నెలల్లోనే ఉన్నాయి. అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోతే.. పదవి కాలం తగ్గించుకున్నట్లు అవుతుంది. అదే సమయంలో ఏపీలో పదకొండు నెలల పాటు సర్వీస్ కంప్లీట్ చేసి రిటైరైతే.. అక్కడ కేసీఆర్ మరోసారి గెలిస్తే.. ఇవ్వాలనుకున్న సలహాదారు పదవి అప్పుడే ఇస్తారని సోమేష్ అంచనా వేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ పెద్దలు దూరం పెట్టరని.. ఆదరిస్తారని అంచనాకు రావడంతో ఆయన ప్రభుత్వం కేటాయించే పోస్టులో చేరాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం సోమేష్ కుమార్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆయనకు త్వరలోనే పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఒక వేళ సోమేష్ కుమార్ తన తదుపరి కార్యాచరణ ఖరారు చేసుకుని వాలంటరీ రిటై్మెంట్ తీసుకోవాలి అనుకుంటే.. వెంటనే తీసుకోవచ్చు. అంగీకరించగలిగే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దీంతో చాయిస్ ఇప్పుడు సోమేష్ చేతుల్లోనే ఉందని.. సర్వీస్ చేయవచ్చని.. లేకపోతే వీఆర్ఎస్ తీసుకోవచ్చని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.