హైదరాబాద్: తలుచుకుంటే గంటలో ప్రభుత్వాన్ని పడగొడతానని జగన్ నిన్న చేసిన ప్రకటనపై తెలుగుదేశం ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. జగన్కు దమ్ముంటే తమ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్ళీ గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. సోమిరెడ్డి ఇవాళ నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందే జగన్ జైలుకు వెళ్ళటం ఖాయమని అన్నారు. అతనికి జైలు భయం పట్టుకుందని చెప్పారు. అశాంతితో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎన్నిసార్లు ఎన్నికల్లో జనం బుద్ధి చెప్పినా జగన్ మళ్ళీ సవాల్ విసురుతున్నారని అన్నారు. 2019 నాటికి జైలులో ఉంటాడా, లేదా అనేది జ్యోతిష్యుడిని అడిగి తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. గాలేరు, హంద్రీ-నీవా ప్రాజెక్టులపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సోమిరెడ్డి చెప్పారు.