ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి… తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రెండోసారి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఇలాంటి దరిద్రమైన భాష మాట్లాడొచ్చనే లైసెన్స్ ఆయనకి ఎవరిచ్చారంటూ మండిపడ్డారు. గతంలో, చంద్రబాబు నాయుడుపై రాజశేఖర్ రెడ్డి విమర్శలు చేస్తే… భాష సరిగా లేదంటూ కేసీఆర్ అన్నారనీ, ఈరోజు ఆయన వాడిన భాష చూస్తుంటే సామాన్యులు ఎవ్వరూ అలాంటి పద్ధతిలో మాట్లాడరన్నారు. ప్రత్యేక హోదాను తాను వ్యతిరేకించలేదని కేసీఆర్ అంటున్నారనీ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ప్రకటించాకే తెలంగాణలో కాంగ్రెస్ అడుగుపెట్టాలని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ గుర్తులేదా అని ప్రశ్నించారు. ఒకవేళ ఏపీ హోదా మీద అంత ప్రేమే ఉంటే… నిన్ననే కదా ప్రధానిని కలిసొచ్చారు, అప్పుడెందుకు ఆయన్ని ఈ అంశం అడగలేకపోయారని సోమిరెడ్డి నిలదీశారు.
కేసీఆర్ మాదిరిగా మాట నిలబెట్టుకున్న నాయకులు దేశంలో ఎవ్వరూ లేరంటూ సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే, తెరాసను కాంగ్రెస్ లో కలిపేస్తామన్నారనీ ఆ పార్టీనే కలిపేశారన్నారు. తెరాసను గెలిపిస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి, ఆ దళితుల గొంతులు కోశారన్నారు. తనను సీఎంని చేస్తే, కరీంనగర్ ను న్యూయార్క్ చేస్తామనీ, వరంగల్ ని లండన్ చేస్తామనీ పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తామనీ హైదరాబాద్ ని డల్లాస్ చేస్తామన్నారనీ.. ఇవన్నీ తెలంగాణ ప్రజలు కోరారా అని ప్రశ్నించారు.
ఫెడరల్ ఫ్రెంట్ గురించి సోమిరెడ్డి మాట్లాడుతూ… ఈ దేశ ప్రగతి గురించి కేసీఆర్ ఉన్న అంచనాలూ, ప్రణాళికలూ ఇంకెవ్వరి దగ్గరా లేవని ఎద్దేవా చేశారు. అభివృద్ధి విషయంలో రంగాల వారీగా లెక్కలు తీస్తే, ఆంధ్రాలో జరిగిన దానికీ, తెలంగాణలో ఆయన చేసినదానికీ తేడా తెలుస్తుందంటూ కొన్ని లెక్కలు చెప్పారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాలనీ, టీడీపీ తయారు చేసినవి కాదన్నారు. మీరు సాధించిన ప్రగతేంటో చెప్పండీ, చంద్రబాబు చేసిన మోసమేంటో వివరించండని నిలదీశారు. శ్వేత పత్రాలపై నోటికొచ్చినట్టు విమర్శలు చేయడం సరికాదనీ, చేతనైతే వాటిని క్షుణ్ణంగా చదివి, విశ్లేషించి మాట్లాడితే బాగుంటుందన్నారు. అమరావతి నిర్మాణానికి రూ. 1500 కోట్లిచ్చారు కదా, నేను రూ. 250 కోట్లకు కట్టేస్తా అని కేసీఆర్ చెప్పడమేంటన్నారు. హైకోర్టును ప్రారంభించేముందు ఐదారు రోజులు సమయమేంటీ, కనీసం ఒక నెలైనా సమయం ఉంటే బాగుంటుందని చంద్రబాబు అన్నారనీ, దీన్లో తప్పేముందన్నారు. ఇంతకీ కేసీఆర్ ఈ కక్ష ఎందుకు అంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు.