మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీజ్ చేస్తున్నారు. కాకాణిని చూడాలని ఉందని అంటున్నారు. ఆయనను చూపించిన వారికి కరోనా ప్యాలెస్ గిఫ్టుగా ఇస్తామని అంటున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిరకాల ప్రత్యర్థులు. సర్వేపల్లి నుంచి చాలా సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి ఇటీవల ఎన్నికల్లో మాత్రం గెలిచారు. అంతకు ముందు సోమిరెడ్డిని నానా మాటలు అనే కాకాణికి ఇప్పుడు రివర్స్ లో షాకులు తగులుతున్నాయి.
గతంలో సోమిరెడ్డిపై తప్పుడు డాక్యుమెంట్లు, విదేశాల్లో ఆస్తిపత్రాలను క్రియేట్ చేసి కేసుల్లో ఇరుక్కున్నారు. కల్తీ మద్యం కేసు కూడా కాకాణిపై ఉంది. మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరులో క్వార్ట్జ్ను దోచుకున్నాడన్న కారణంతో కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు ప్రెస్మీట్లు పెట్టి కేసులకు భయపడేది లేదు.. ఎక్కడికీ వెళ్లను దమ్ముంటే అరెస్టు చేసుకోవాలని సవాళ్లు చేసేవారు. అయితే కేసు నమోదు అయి అరెస్టు చేస్తారని తెలియగానే జంపయ్యారు. ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. మరో వైపు కోర్టుల్లోనూ ఆయనకు ఊరట లభించలేదు.
దీంతో సోమిరెడ్డి.. గతంలో ఆయన చేసిన చాలెంజ్ లను గుర్తు పెట్టుకుని ఇప్పుడు టీజ్ చేస్తున్నారు. కేసులకు భయపడేది లేదన్న పెద్దమనిషి ఇప్పుడు కనిపించకుండా పోయారని.. మంత్రులుగా చేసిన వాళ్లు కూడా ఇంత భయపడతారా అని ప్రశ్నిస్తున్నారు. కోర్టుల నుంచి రిలీఫ్ వచ్చిన తర్వాత కాకాణి వచ్చి సోమిరెడ్డికి కౌంటర్ ఇస్తారు. అప్పటి వరకూ సోమిరెడ్డి వన్ సైడ్ బ్యాటింగ్ చేస్తారని సర్వేపల్లిలో సెటైర్లు వినిపిస్తున్నాయి.