వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి ఎమ్మెల్యేలు చాలా మంది క్యూ కట్టినట్లుగా వరుసగా.. తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేసేస్తున్నారు ఎందుకు? ఈ ప్రశ్నను జంప్ చేసేస్తున్న ఎమ్మెల్యేలను అడిగితే.. నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళుతున్నాం.. చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి చాలా కష్టపడుతున్నారు.. ఆయనకు మద్దతుగా వెళుతున్నాం, వైఎస్ జగన్మోహనరెడ్డి ఎదుటివారు చెప్పే మాటలు వినడం లేదు.. పార్టీ నిర్వహణలో ఆయన అరాచక పోడకలకు నిరసనగా వెళుతున్నాం.. అంటూ ఎవరికి తోచిన రీతిలో వారు కారణాలను వెల్లడిస్తూ ఉంటారు. కానీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ, ప్రస్తుతం మంత్రిపదవి కోసం నిరీక్షిస్తూ నారా లోకేష్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్న సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి… తాజాగా డిటెక్టివ్ పాత్ర పోషించారు. వైకాపాను ఎమ్మెల్యేలు ఎందుకు వీడుతున్నారనడానికి ఓ సరికొత్త కారణాన్ని కనుగొన్నారు.
సోమిరెడ్డి వారి కథనం ప్రకారం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని టోకుగా సోనియాగాంధీ పాదాల వద్ద తాకట్టు పెట్టడానికి జగన్ ఒక ఒప్పందం చేసుకున్నారుట. వైకాపా పార్టీని మొత్తం అమ్మ పాదాల వద్ద పెట్టేస్తున్నారనే సంగతి తెలుసుకుని, అది ఇష్టంలేని ఎమ్మెల్యేలే ఇప్పుడు తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటున్నారట. ఈ విషయాన్ని డిటెక్టివ్ సోమిరెడ్డి కొత్తగా బయటపెట్టారు.
లోకేష్ బ్యాచ్ సీనియర్ నాయకుడిగా సోమిరెడ్డికి పార్టీలో ఒక గుర్తింపు ఉంది. లోకేష్ మీద ఈగ వాలినా సరే.. దాన్ని కౌంటర్ చేయడానికి సోమిరెడ్డి సదా సిద్ధంగా ఉంటారు. తాజా పరిణామాల్లో తన మీద అవినీతి ఆరోపణలు నిరూపించాలని లోకేష్ జగన్‌కు సవాలు విసరడం, దాన్ని ప్రతిస్పందనగా రోజా ఆయనను పప్పుసుద్ద అంటూ ఎద్దేవా చేయడం తెలిసిందే. రోజా విమర్శలకు సోమిరెడ్డి స్పందించారు. లోకేష్‌ను విమర్శించే అర్హత రోజాకు లేదన్న సోమిరెడ్డి ఆమెకు జగన్ అవినీతి గురించి తెలియదా? అంటూ ప్రశ్నించారు. పనిలో పనిగా.. వైకాపా నుంచి ఎమ్మెల్యేలు ఎందుకు వలస వెళ్తున్నారో ఈ కొత్త విషయాన్ని కూడా బయటపెట్టారు.
చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని సోనియా గాంధీ చరణముల వద్ద పెట్టి కాంగ్రెస్‌లో కలిపేశారు గనుక, జగన్ కూడా అలాగే కలిపేస్తారు అంటే ఆ పుకారు కాస్త స్పైసీ గా, జనానికి ఇంటెరెస్టింగ్ గా ఉంటుందని చెప్పారో.. లేదా, ఆ రకమైన మైండ్‌గేం ద్వారా మరింత మంది వైకాపా ఎమ్మెల్యేల్లో తెదేపా వైపు మొగ్గేలా భయాన్ని రేకెత్తించదలచుకున్నారో మాత్రం బోధపడడం లేదు.