తెదేపా ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసారు. జగన్ సాక్షి మీడియాను అడ్డుపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఆ పత్రికలో రాష్ట్ర ప్రభుత్వం గురించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి నిరాధారమయిన వార్తలు, కధనాలు ప్రచురిస్తూ, వారి ప్రతిష్టని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హెరిటేజ్ డైరెక్టర్ మోతపర్తి శివరామ ప్రసాద్ పేరు పనామా పేపర్స్ లో కనిపిస్తే, అది చంద్రబాబు నాయుడే అన్నట్లుగా ఇద్దరికీ ముడిపెట్టి సాక్షి మీడియా తప్పుడు కధనాలు ప్రచురిస్తోందని సోమిరెడ్డి మండిపడ్డారు. అయితే పనామా పేపర్లలో బయటపడిన పేర్లలో ఎక్కువ మంది జగన్ అనుచరులే ఉన్న సంగతి గురించి కూడా సాక్షిలో చెప్పుకొంటే బాగుండేదని సోమిరెడ్డి ఎద్దేవా చేసారు. ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. సాక్షి మీడియాలో వస్తున్న వార్తలను చూసినట్లయితే వైకాపాకి, తెరాసకి ఉన్న గొప్ప అనుబంధం దాని ప్రతీ అక్షరంలోనూ కనిపిస్తుందని అన్నారు. ఒకవైపు తెరాసతో రహస్య సంబంధాలు కలిగి ఉంటూ, తెలంగాణా ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నట్లు కర్నూలు లో నిరాహార దీక్షలు చేయడానికి అర్ధం ఏమిటని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నట్లయితే వెళ్లి తెలంగాణాలోనే నిరాహార దీక్షలు చేయాలనీ సోమిరెడ్డి డిమాండ్ చేసారు. జగన్మోహన్ రెడ్డిని, ఆయన చేసే దీక్షలను ఏపిలో ప్రజలు ఎన్నడూ నమ్మరని సోమిరెడ్డి అన్నారు.
ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ ఒక బలమయిన మీడియాని ఏర్పాటు చేసుకొని సమైక్య రాష్ట్రంలోను, విభజన తరువాత కూడా రాష్ట్ర ప్రభుత్వాలపై చాలా గట్టిగా వ్యతిరేక ప్రచారం చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. చూస్తూనే ఉన్నారు. సాక్షి మీడియాలో తెదేపా ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకంగా, తెరాసకు పూర్తి అనుకూలంగా వార్తలు, కధనాలు ప్రచురించడం గమనిస్తే సోమిరెడ్డి ఆరోపణలు వాస్తవమని అర్ధమవుతాయి. ఒక ప్రతిపక్ష నేతగా జగన్ చంద్రబాబు నాయుడు నిర్ణయాలని తప్పు పట్టడం, ఆయనని విమర్శించడం, ప్రభుత్వంలో లోపాలను, తప్పులను ఎత్తి చూపడం సహజమే. కాని సాక్షి మీడియా కూడా జగన్ మనోభావాలు, ఆలోచనలు, వ్యూహాలు, ఆశలు, అభిప్రాయాలనే వార్తలు, కధనాలుగా ప్రచురించడమే చాలా తప్పు. అప్పుడు అది కూడా వైకాపాకి అనుబంధ సంఘంలాగ అనుబంధ మీడియా అవుతుంది తప్ప ప్రజాభిప్రాయలకు అద్దం పట్టినట్లు భావించలేము. చంద్రబాబు నాయుడుపై జగన్ కున్న వ్యతిరేకత సాక్షిలో ప్రచిరితమయ్యే వార్తలు, కధనాలలో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూనే ఉంటుంది. చంద్రబాబు నాయుడుని జగన్ వ్యతిరేకిస్తున్నారు కనుక సాక్షి కూడా వ్యతిరేకిస్తున్నట్లు వ్యవహరిస్తోంది. చంద్రబాబు నాయుడుని, ఆయన ప్రభుత్వాన్ని తప్పు పట్టే ప్రయత్నంలో అది రాష్ట్రాన్ని కూడా శత్రువుగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం చాలా అవినీతికి పాల్పడుతోంది. రాష్ట్రంలో పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వార్తలు, కధనాలు ప్రచురిస్తున్న సాక్షి కళ్ళకి, ఆంద్ర ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్న తెలంగాణా ప్రభుత్వ చర్యలు మాత్రం కనబడవు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాల వలన రాష్ట్రానికి, హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రా ప్రజలకి ఎన్ని సమస్యలు, సవాళ్ళు ఎదురయినా సాక్షి ఏనాడూ వాటి గురించి ఒక్క ముక్క కూడా వ్రాయకపోవడం గమనిస్తే సోమిరెడ్డి ఆరోపణలు నిజమని అర్ధమవుతుంది.
జగన్ ఇప్పుడు తెలంగాణాలో ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేస్తాననగానే సాక్షి కూడా తెలంగాణా ప్రభుత్వ నిర్ణయాలని వ్యతిరేకిస్తూ, దాని వలన రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతోందని వరుసగా వార్తలు, కధనాలు ప్రచురించడం మొదలుపెట్టింది. సాక్షి ప్రజలకు మనసాక్షినని చెప్పుకొంటుంది కానీ దాని వార్తలు, కధనాలు, తెలంగాణా పట్ల దాని ద్వంద వైఖరి అన్నీ నిశితంగా గమనిస్తున్న వారికి అది జగన్మోహన్ రెడ్డికే మనసాక్షి అని అర్ధం అవుతుంది. అదే ముక్క సోమిరెడ్డి క్లుప్తంగా చెప్పారనుకోవచ్చు.