తెలుగుదేశంలో సెంటిమెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముహూర్తం చూసుకోనిదే ముఖ్యమంత్రి ఏపనీ చేయరు అంటారు! ఈ విషయంలో చాలామంది నేతలు ఆయన్నే ఆదర్శంగా తీసుకుంటున్నారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇదే తరహాలో ఓ నమ్మకాన్ని ఫాలో అయిపోతున్నారట! మూడేళ్ల కిందట నెల్లూరులో ఓ కార్యాలయాన్ని సోమిరెడ్డి నిర్మించుకున్నారు. ఇందులోకి వచ్చిన దగ్గర నుంచీ సోమిరెడ్డి రాజకీయ భవిష్యత్తు మారిపోయిందని అనుచరులు అంటున్నారు. గడచిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. ఆ తరువాత ఎమ్మెల్సీ కావడం, వెంటనే మంత్రి పదవి రావడం.. ఆ భవనంలోకి వచ్చాక అన్నీ అలా కలిసి వచ్చేశాయట! అందుకే, ఇప్పుడీ కార్యాలయాన్ని తన కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేటాయించారు. అంటే, కుమారుడిని రాజకీయాల్లోకి తెస్తున్నట్టు సంకేతాలు ఇచ్చినట్టే కదా!
తన కుమారుడి రాజకీయ రంగ ప్రవేశానికి సోమిరెడ్డి క్షేత్రస్థాయిలో చేయాల్సిన పనులు మొదలుపెట్టేశారనే చెప్పాలి. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని తన కుమారుడి ఎంట్రీకి వేదికగా మార్చుకున్నారు. సర్వేపల్లి నియోజక వర్గ పరిధిలో జరుగుతున్న ఇంటింటికీ కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి చురుకైన పాత్ర పోషిస్తున్నారని మంత్రి సోమిరెడ్డి చెప్పారు. ఇప్పటికే దాదాపు పదహారు వేల ఇళ్లకు తన కుమారుడు వెళ్లాడనీ, ప్రజల సమస్యలు తెలుసుకున్నాడనీ, అవన్నీ ఎప్పటికిప్పుడు ముఖ్యమంత్రి డాష్ బోర్డ్ కి వెంటనే పంపుతున్నాడన్నారు. పార్టీ నేతలు కూడా తన కుమారుడిని ఓ సోదరుడిలా ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నారని సోమిరెడ్డి చెప్పారు. అయితే, తన కుమారుడిని వచ్చే ఎన్నికల్లో దింపడం తనకు పెద్దగా ఇష్టం లేదనీ, ఏదేమైనా పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉంటామని ఆయన చెప్పడం విశేషం.
నిజానికి, సర్వేపల్లి నియోజక వర్గంలో గత కొన్నాళ్లుగా ప్రభుత్వ కార్యక్రమాలను రాజగోపాల్ చూసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దింపాలనేదే మంత్రి మనోగతం అనడంలో సందేహం లేదు. పైగా, తనకు సెంటిమెంట్ అయిన ఆఫీస్ ను కూడా కుమారుడికి కేటాయించారంటే… ఇవ్వాల్సిన సంకేతాలు స్పష్టంగానే ఇస్తున్నట్టు కదా! అలాంటప్పుడు, తనకు ఇష్టం లేదూ పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉంటామనే కబుర్లు ఎందుకు చెప్పండీ! టీడీపీలో వారసత్వ రాజకీయాలు కొత్తేం కాదు! ఇప్పటికే పరిటాల సునీత కుమారుడు, దివంగత నేత ఎర్రన్నాయుడు కుమారుడు, అయ్యన్నపాత్రుడు కుమారుడు, బొజ్జల, జేసీ వారసులు.. అందరూ ఎంట్రీ ఇచ్చేశారు. ఎలాగూ రెండోతరం పార్టీ అధినాయకత్వం నారా లోకేష్ చేతికే రాబోతోంది. ఈ నేపథ్యంలో తమ వారసులను రంగంలోకి దింపడానికి టీడీపీ నేతలు రెడీ అవుతున్నారు!