కాపులను బిసిలలో చేరుస్తూ రాష్ట్ర శాసనసభ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపితే ప్రధానితో మాట్లాడి పార్లమెంటు ఆమోదం పొందేలా చూడగలమని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు చెప్పారు.
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం నివాసానికి వెళ్ళి కాపు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. పద్మనాభం, వీర్రాజు ఏకాంతంగా సుదీర్ఘమైన చర్చలు జరిపారు. “ఏ రాజకీయ పార్టీలో వున్నప్పటికీ కాపులంతా ముద్రగడ పద్మనాభానికి మద్దతు ఇవ్వాలని” ఆ తరువాత మీడియా ద్వారా వీర్రాజు విజ్ఞప్తి చేశారు. “ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కాపులకు ఇచ్చిన హామీలను సాధించుకునే దిశగానే ఉద్యమం జరుగుతుందని” ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జనసేన బ్యానర్లతో పవన్ కల్యాణ్ అభిమానులు, ఇప్పటికే ముద్రగడ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఆయా పార్టీల నాయకులు తమ ఫొటోలతో, తమ పార్టీ పతాకాలతో, ముద్రగడ ఫొటోలతో కాపు డిమాండ్లు వున్న ఫ్లెక్సీలను ప్రదర్శిస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తుకాగా, రాష్ట్రంలో అధికారంలో వున్న తెలుగుదేశం మిత్రపక్షమైన బిజెపిలో ఒక సీనియర్ నాయకుడైన సోము వీర్రాజు స్వయంగా ముద్రగడకు మద్దతు ప్రకటించడంతో తెలుగుదేశం మీద వత్తిడి పెరుగుతున్నట్టే!
తెలుగుదేశం పార్టీని బిజెపిలో కొందరు నాయకులు సమర్ధిస్తారు. కొందరు వ్యతిరేకిస్తారు. పుష్కరాల్లో అవినీతి, పోలవరం ప్రాజెక్టులో అవకతవకలు, పట్టిసీమ ఎత్తిపోతలలో అనవసర వ్యయాలు…మొదలైన అంశాలపై సోము వీర్రాజు మొదటిసారి బహిరంగ విమర్శలు చేశారు. బిజెపిలోనేగాక సామాన్య ప్రజల్లో కూడా ఆయనకు మద్దతు పెరుగుతూండటంతో చంద్రబాబు చక్రంతిప్పారు. మిత్రపక్షాలైన తెలుగుదేశం, బిజెపిల సమన్వయ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి హాజరుకాకపోవడం ద్వారా వీర్రాజు తన మౌన నిరసనను వ్యక్తం చేశారు. అయితే సమావేశపు నిర్ణయం ప్రకారం ఆతరువాత ఆయన బహిరంగ విమర్శ చేయలేదు.
ఇపుడు ఏపార్టీలో వున్న కాపులైనా ఏకంకావాలన్న వీర్రాజు పిలుపును తెలుగుదేశం కాని, బిజెపి కాని తప్పుపట్టలేదు. ఈ విధంగా కాపు ఉద్యమం గురిపెట్టిన చంద్రబాబు ప్రభుత్వానికి వీర్రాజు మరోసారి మింగుడుపడని అస్త్రమై ఎదురునిలిచారు.