ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవలి కాలంలో నోరు కాస్త పెద్దది చేసుకుటంున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. నెగెటివ్ కామెంట్లు వచ్చినా పబ్లిసిటీనే కదా… అలాంటి పబ్లిసిటీ వస్తే చాలు ఇమేజ్ వస్తుందని ఆశపడుతున్నారేమో కానీ ముందూ వెనుకా చూసుకోకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా కడప జిల్లా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో సీరియస్గా తీసుకుని బూతులు తిడుతున్నారు. కడప జిల్లాలో ఎయిర్పోర్టు ఎందుకు వాళ్లకి ప్రాణం తీయడమే వచ్చు అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున సోము వీర్రాజుపై బండ బూతులతో విరుచుకుపడుతున్నారు. సోము వీర్రాజు ఏ ఉద్దేశంతో చెప్పారో కానీ చెప్పిన విధానం.. వాడిన మాటలు మాత్రం సరి కాదు. దీంతో ఆయనకు తిట్లే రిప్లయ్గా వస్తున్నాయి. ఇటీవల సోము వీర్రాజు ఈ తరహా వ్యాఖ్యలు చేయడంలో ముందున్నారు. చీప్ లిక్కర్ యాభై రూపాయలకే ఇస్తానంటూ బహిరంగసభలో ప్రకటించి .. ఆయన దేశవ్యాప్తంగా బీజేపీకి చెడ్డపేరు తీసుకు వచ్చారు. తనకు మాత్రం పబ్లిసిటీ వచ్చేలా చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఆయన అర్థం లేని ఆవేశానికి లోనవుతున్నారు. ఎందుకలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారో బీజేపీ నేతలకే అర్థం కావడం లేదు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే వివాదాస్పద ప్రకటనలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కానీ.. తనేమీ చేయలేకపోయానని.. ఆయన తరహాలో కామెంట్లు చేసి ప్రచారం పొందే ప్రయత్నంలో ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. అయితే ఇది రాంగ్రూట్లో వెళ్తోందని ఫీడ్ బ్యాక్ వస్తోంది. మరి సోము వీర్రాజు కరెక్ట్ చేసుకుంటారో లేదో .. ?