ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతాపార్టీ నాయకుల వ్యవహారశైలి ప్రజల్ని తీవ్రంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విభజన చట్టంలో పేర్కొన్న పందొమ్మిది హామీలు.. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ … ఇప్పటి వరుక నెవరవేరలేదు. మిగతా వాటి సంగతేమో కానీ.. ప్రత్యేకహోదా అంశం మాత్రం సెంటిమెంట్ గా మారింది. ఇలాంటి సందర్భంలో బీజేపీ నేతలు…ప్రజలకు సర్దిచెప్పే ప్రయత్నం చేయాలి కానీ..అదేదో ప్రభుత్వం.. అధికార పార్టీకి సంబంధించినది అయినట్లు.. ఆ పార్టీ నేతలను బెదిరిస్తూ… ఏదో సాధించేస్తున్నామనుకుంటున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి… ఏమైనా చేయగలమన్నట్లుగా .. ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు బెదిరిస్తున్నారు. ఏపీ బీజేపీ బాధ్యతల్ని చేపట్టిన రామ్ మాధవ్.. మూడు నెలల్లో.. టీడీపీ పని ఫినిష్ అవుతుందని బెదిరించినట్లు వార్తలొచ్చాయి. అదే సమయంలో కర్ణాటక బీజేపీ ఇన్చార్జ్ గా ఉన్న మురళీధర్ రావు.. రెండు నెలల్లో ఏపీలో అనూహ్య పరిణామాలు వస్తాయని.. టీడీపీ బతికి బట్టకట్టడమేనని వ్యాఖ్యానించి సంచలనం రేపారు. ఎంతైనా బీజేపీలో.. కేంద్ర స్థాయిలో నిర్ణయాలు ప్రభావితం చేయగల స్థాయి నేతుల వీరు. వీరి మాటలు సహజంగానే ఏపీ ప్రజల్లో అలజడి రేపాయి. అదే సమయంలో.. సోము వీర్రాజు.. చంద్రబాబుకు జరిగిన అలిపిరి ప్రమాదాన్ని గుర్తు చేసి..మళ్లీ వచ్చే ఏడాది అలాంటిది జరుగుతందంటూ.. బెదిరింపులు ప్రారంభించారు.
బీజేపీ నేతల బెదిరింపులతో.. టీడీపీ నేతలు ఏమైనా భయపడతారో లేదో.. కానీ సాధారణ ప్రజల్లో మాత్రం.. చంద్రబాబుపై.. ఆయన ప్రభుత్వంపై ఏదో కుట్ర జరుగుతోందన్న అభిప్రాయం మాత్రం బలపడేలా చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం హీరో శివాజీ ఆపరేషన్ గరుడ అంటూ ఓ కొత్త కథను వినిపించారు. అదంతా సినిమా స్టోరీ అని ప్రజలు కూడా తీసి పడేశారు. కానీ బీజేపీ నేతల బెదిరంపులు.. వరుసగా జరుగుతున్న పరిణామాలతో నిజంగానే బీజేపీ.. గరుడను అమలు చేస్తోందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది. నిజంగా కుట్రలు చేసేవాళ్లెవరూ బయటకు చెప్పుకోరు. అలా చెప్పుకునేవారెవరూ కుట్రలు చేయరు. కానీ జరిగినవన్నీ జరిగిన తర్వాత తమకేమీ తెలియని .. బీజేపీ నేతలు నెత్తినోరూ బాదుకున్నా.. వినెవారుండరు.