పురందేశ్వరికి ఏపీ బీజేపీ చీఫ్ గా బాధ్యతలిచ్చాక అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయిన సోము వీర్రాజు మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆయన పార్టీ కార్యాలయాల ప్రారంభం విషయంలో కీలక ప్రకటనలు చేస్తూ తెరపైకి వస్తున్నారు. బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేయబోతోందని అందుకే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఆఫీసులు ప్రారంభిస్తున్నామని చెప్పుకొస్తున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే ఏదో సాధించేసే లీడర్ లాగా సోము వీర్రాజు ప్రకటన చేయడం ఆ పార్టీలోని నేతల్ని కూడా కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది.
బీజేపీ ఏమైపోయినా పర్వాలేదు జగన్ రెడ్డికి చిన్న నష్టం జరగకూడదన్న పాలసీని సోము వీర్రాజు ఇంకా కంటిన్యూ చేస్తారని ఆయన వైపు అనుమానంగా చూస్తున్నారు. జనసేనతో పొత్తు ఉంది మొర్రో అని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. జనసేన కోటాలో టీడీపీ కేటాయించే సీట్లులో కొన్ని బీజేపీకి ఇస్తారని ఆశపడుతున్నారేమో కానీ ఆ పొత్తుల ప్రకటనలు ఆపడం లేదు. కానీ సోము వీర్రాజుకు అది కూడా ఇష్టం లేదనుకుంటా సొంతంగా పోటీ చేయాల్సిందేనని రంగంలోకి దిగిపోయారు.
పొత్తులు ఉంటే పురందేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేయవచ్చన్న ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. దీంతో ఆయన వెంటనే రంగంలోకి దిగిపోయారు. రాజమండ్రి బీజేపీకి బాహుబలిని తానేనని చెప్పుకునేందుకు వెంటనే… పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ఆఫీసులు ప్రారంభించేశారు. వీర్రాజు హడావుడి చూసి ఆ పార్టీ నేతలు కూడా వీర్రాజు రాజకీయం అంటే ఏటనుకుంటున్నారు.. అని సెటైర్లు వేస్తున్నారు.