బీజేపీ నేత సోము వీర్రాజు జగన్ పై నిప్పులు చెరిగారు. రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏ విషయంలో అంటే టీచర్, పేరెంట్స్ మీటింగ్ విషయంలో. కూటమి ప్రభుత్వంలో జరిగిన పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ సమావేశాలు గొప్పగా జరిగాయని.. కానీ వీటిని జగన్ పబ్లిసిటీ స్టంట్ అనడం ఏమిటని మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వం లోనే పేరెంట్స్ కమిటీ సమావేశాలు జరిగాయని జగన్ అబద్ధాలు చెబుతున్నారని.. నాకు తెలిసి ఎక్కడా కూడా ఈ తరహాలో ఇటువంటి పేరెంట్స్ కమిటీ సమావేశాలు జగన్ జమానాలో జరగలేదని స్పష్టం చేశారు.
ప్రతి స్కూల్ కి కేటాయించే బడ్జెట్ తెలిసేలా పేరెంట్స్ మీట్ లో అధికారులు వివరించారని.. ఈ పేరెంట్స్ మీటింగ్ సమావేశాలు దేశంలోనే ఒక గొప్ప అధ్యాయంగా నిలిచాయనిప్రశ్నించారు. ఇంత చక్కటి కార్యక్రమం పై కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయడం సమంజసం కాదని.. జగన్ చేసిన వ్యాఖ్యలు ను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సోము వీర్రాజు ఇలా జగన్ పై విరుచుకుపడటం బీజేపీ నేతల్ని కూడా ఆశ్చర్యపరిచింది.
ఏపీ బీజేపీలో అత్యంత సీనియర్ అయిన ఆయన కూటమి పంపకాల్లో భాగంగా తన సీనియార్టీకి తగ్గ పదవిని వచ్చే మూడేళ్లలో అయినా పొందాలనుకుటున్నారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సీట్ల విషయంలో అవకాశం వస్తే కూటమిలోని ఇతర పార్టీలు అభ్యంతరం చెప్పకుండా.. కూటమి ప్రభుత్వాన్ని పొగుడుతూ.. జగన్ ను విమర్శిస్తూ.. గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారని అనుకుంటున్నారు. ఆయన గత ఇమేజ్ అంత గొప్పగా లేదు. ఏపీ బీజేపీలో వైసీపీ వర్గంగా చెబుతారు. దీన్ని మార్చుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు.