ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. తమ పార్టీ అధికారం చేపట్టే విషయం పట్ట ఆషామాషీగా లేరు. చాలా సీరియస్గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టిన తర్వాత ఏం చేయాలో.. ఎలా చేయాలో.. ఆంధ్రను ఎలా అభివృద్ది చేయాలో కూడా ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. దానికి ఆయన పెట్టిన పేరు సమృధ్ ఆంధ్ర”..!. అంటే… తెలుగు రాష్ట్రమైనప్పటికీ.. ఢిల్లీ నాయకులకు అర్థమవ్వాలని హిందీలో పెట్టినట్లుగా ఉన్నారు. ఆంధ్రను సంవృద్ధిగా అభివృద్ధి చేస్తామని సోము వీర్రాజు ఈ పేరు ద్వారా చెప్పదల్చుకున్నట్లుగా ఉన్నారు. అధికారంలోకి రాగానే… సురక్ష ఆంధ్రప్రదేశ్ పేరుతో..దేశంలోనే ఆదర్శంగా తయారు చేస్తామని ప్రకటించారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేప్టటిన తర్వాత తొలి సారి కొత్తగా నియమితులైన పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు పార్టీలు కుటుంబరాజకీయాలు చేస్తున్నాయి.. బీజేపీ మాత్రం వాటికి దూరమన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం సాధిస్తామని సోము వీర్రాజు.. పదాధికారులు, జిల్లా అధ్యక్షులకు భరోసా ఇచ్చారు. అయితే… ముందుగా ప్రజల కోసం పని చేసి.. ప్రజా సమస్యల కోసం పోరాటం చేసి.. ప్రజల్లో పలుకుబడి సంపాదించుకుంటేనే గెలుస్తారు. కానీ బీజేపీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందో లేదో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రభుత్వ వైఫల్యాల కన్నా.. ప్రతిపక్షం మీద విమర్శలు చేయడానికే సమయం కేటాయిస్తున్నారు.
ఈ కారణంగా అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా కన్నా.. మిత్రపక్షంగా ప్రజలు భావిస్తున్నారు. ఈ ముద్ర పెట్టుకుని ప్రజల వద్దకు తామే ప్రత్యామ్నాయం ఓటు వేయండి అని ఎలా వెళ్తారన్నది చాలా మందికి అర్థం కాని విషయం. అయినప్పటికీ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజుకు మాత్రం ఓ క్లారిటీ ఉంది. గెలుస్తామో లేదో అని టెన్షన్ పడటం లేదు.. గెలిచిన తర్వాత ఆంధ్రను ఎలా అభివృద్ధి చేయాలా అని మాత్రమే ఆయన కాస్త ఆలోచిస్తున్నారు.