ఆంధ్రాలో తాము సాధించిన విజయం, చేసిన గొప్ప పని అని పోలవరం ప్రాజెక్టు గురించి భాజపా నేతలు గొప్పలు చెప్పుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వల్లనే పోలవరం పనులు సాగుతున్నాయంటారు. జాతీయ ప్రాజెక్టు కాబట్టి, బాధ్యత తమదే అంటారు. దీన్ని ప్రజలు నమ్ముతారా లేదా అనేది పక్కనపెడితే… వచ్చే ఎన్నికల్లో ఆంధ్రాలో భాజపాకు ప్రచారం చేసుకునేందుకు మిగులున్న బలమైన అంశాల్లో ఇదీ ఒకటి. అయితే, దీన్ని కూడా వదులుకునేందుకు భాజపా నేతలు సిద్ధపడుతున్న వైనం చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తోంది. భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు తాజాగా మీడియాతో మాట్లాడుతూ… పోలవరం ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డిదే అన్నారు. ఆయన ధైర్యం, దమ్ము ఉన్న నాయకుడు అంటూ మెచ్చుకున్నారు.
పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ హయాంలోనే అంజయ్య శంకుస్థాపన చేశారనీ, ఆ తరువాత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ముఖ్యమైన పనులన్నీ ప్రారంభమయ్యాయన్నారు సోము వీర్రాజు. ఈ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సిగ్గుందా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ నిర్లక్ష్యం చేస్తున్నారంటూ విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇప్పటికే కేంద్రం ఆరువేల కోట్లకుపైగా ఖర్చు చేసిందన్నారు. చంద్రబాబు నాయుడు 2014లోనే అధికారంలోకి వచ్చినా, అక్కడి నుంచి రెండేళ్లపాటు పోలవరం ప్రాజెక్టు పనులను ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయిందనీ, పనులపై శ్రద్ధలేని కాంట్రాక్టర్లను పెట్టారనీ, కమిషన్లు దండుకోవడంపైనే ఎక్కువగా శ్రద్ధ పెట్టారంటూ ఆరోపించారు.
సరే, పోలవరానికి చంద్రబాబు నాయుడు సర్కారు ఏమీ చెయ్యనప్పుడు… రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చును ఏమనాలి..? కేంద్రం నిధులు ఆలస్యం చేస్తుంటే ఊరుకోవచ్చు కదా..? ఆ బిల్లుల్ని చెల్లించుకుండా కేంద్రం తాత్సారం చేస్తున్న తీరును ఏమనాలి..? టీడీపీ మీద వీర్రాజు విమర్శలు రొటీన్ అనుకుందాం కాసేపు. పోలవరం పనుల ఘనత వైయస్సార్ దే అని ఆయన కామెంట్ చేయడం వెనక ఉద్దేశమేంటి..? రాష్ట్రంలో భాజపాకి వచ్చే ఎన్నికల్లో కాస్తోకూస్తో ఉపయోగపడే ప్రచారాంశం కదా ఇది. దీన్ని వైయస్సార్ ఘనత అని వ్యాఖ్యానించడం వల్ల పరోక్షంగా ఎవరికి మద్దతు ప్రకటిస్తున్నట్టు..? ఇలాంటి వ్యాఖ్యల ద్వారా ఎవరికి రాజకీయ లబ్ధి చేకూర్చాలన్నది సోము వీర్రాజు ఆరాటం..? ఇలాంటి వ్యాఖ్యానాలు వినిపిస్తున్నప్పుడే… భాజపా అసలు రంగు బయటపడుతూ ఉంటుంది.