భాజపా నేత సోము వీర్రాజు ప్రెస్ మీట్ పెట్టారంటే.. ఒకటే కంటెంట్ ఉంటుంది! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు మాత్రమే ఎక్కువగా వినిపిస్తాయి. తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దీన్లో సీఎంపై విమర్శలతోపాటు, భారతీయ జనతా పార్టీ స్వభావం గురించి ఓ నాలుగు మాటలు మాట్లాడారు. ముందుగా, సీఎంపై విమర్శల గురించి చెప్పాలంటే… కేంద్ర పథకాలను తన సొంత కార్యక్రమాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. తమ పార్టీతో పొత్తు లేకుండానే గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారా అన్నారు.
చంద్రబాబు భయానికి లోనౌతున్నారనీ, తనకు రక్షణ వలయంగా ఉండాలని ప్రజలను కోరుతున్నారని చెప్పారు. ప్రతీరోజూ ప్రతీ విషయంలో ఆయన అభద్రతాభావంతో ఉంటున్నారని వీర్రాజు అన్నారు. తనకు ఏదో జరిగిపోతుందనే భయాందోళలకు సీఎంతోపాటు ఆయన కుమారుడు గురౌతూ ఉన్నారన్నారు. 2019లో మరోసారి మోడీ అధికారంలోకి వస్తే తామంతా ఏమైపోతాం, ఎటు వెళ్లిపోతాం అనే భయం చంద్రబాబులో ఉందన్నారు. ఇదీ అసలు పాయింట్.. ‘భారతీయ జనతా పార్టీలో ఎన్నడూ ఒక అధికారం కోసం నిరంతరం ప్రయత్నించేటి వ్యవస్థగానీ, సంస్థగానీ భాజపా కాదు’ అని సోము వీర్రాజు చెప్పారు. అధికారం కోసం పాకులాడే పార్టీ భాజపా కాదన్నారు! నిత్యం అధికారం కోసం ఆలోచించే పరిస్థితి భాజపాలో ఎన్నడూ ఉండదన్నట్టు కొత్త నిర్వచనం ఇచ్చారు.
అధికారం కోసం నిరంతరం భాజపా ప్రయత్నించదు అని వీర్రాజు చెబుతుంటే హాస్యాస్పదంగా ఉంది! ఎలాగోలా అధికారంలోకి రావడం ఒక్కటే భాజపా లక్ష్యం తప్ప, వేరేది ఉందా..? కర్ణాటకలో అధికారం దక్కకపోయేసరికి ఎంతగా గంగవెర్రులెత్తారో ప్రజలకు తెలీదా..? వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు దెబ్బతీసేలా ఉన్నాయే అనే పక్కబెదురు మొదలయ్యేసరికి… దూరమైనవాళ్లను బుజ్జగించేందుకు భాజపా అధ్యక్షుడు అమిత్ షా బయలుదేరారు కదా. వచ్చే ఎన్నికల్లో అధికారం చేజారకూడదన్న ముందు జాగ్రత్తతో చేస్తున్న ప్రయత్నమే కదా ఇది..?
చంద్రబాబు భయాందోళనలకు గురౌతున్నారని వీర్రాజు అంటున్నారు కదా.. అలాంటి వాతావరణం సృష్టిస్తున్నది ఎవరు..? తెల్లారింది మొదలు జీవీఎల్ లాంటివాళ్లను ఉసిగొల్పుతూ టీడీపీ పనైపోతుందీ, సీఎం సంగతి తేలిపోతుందీ అంటూ కవ్వింపు ప్రకటనలు చేస్తున్నది కూడా వారే కదా! ఇప్పటికైనా, కనీసం ఇప్పటికైనా.. రాష్ట్రం తరఫున ఒక్కసారైనా సోము వీర్రాజు లాంటి భాజపా నేతలు ఆలోచిస్తే ప్రయత్నం చేస్తారా..? సొంత రాష్ట్రం ఎందుకు ఇంతగా రగిలిపోతోందన్న ఆత్మ విమర్శ వీరిలో అసాధ్యమేమో..?