చంద్రబాబుతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని.. అది మోదీ, చంద్రబాబు మధ్య ఎలా ఉంటుందో అలా ఉంటుందని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీగా అవకాశం రావడంతో ఆయన నామినేషన్ వేశారు. అయితే ఆయన జగన్ మోహన్ రెడ్డి కోవర్టు అనే ప్రచారం ఎక్కువగా సాగడంతో ఆయన మీడియా ప్రతినిధులకు వివరణ ఇచ్చారు. ఇలాంటి ప్రచారం అంతా అపోహలేనని స్పష్టం చేశారు. సీఎం అయ్యే వరకూ జగన్ మోహన్ రెడ్డితో తనకు పరిచయం కూడా లేదన్నారు.
కానీ చంద్రబాబుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. 2014లో కూటమిలో భాగంగా పోటీ చేసినప్పుడే చంద్రబాబు తనకు మంత్రి పదవి ఇస్తానన్నారని చెప్పుకొచ్చారు. నిజానికి అప్పట్లో సోము వీర్రాజు పోటీ చేయలేదు. ఆయనకు రాజమండ్రి రూరల్ చాన్స్ వచ్చినా మరో నేతకు టిక్కెట్ ఇప్పించారని అంటారు. అయితే తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. కానీ ఎప్పుడూ ఆయన కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడలేదు. అందుకే ఆయనను జగన్ కోవర్ట్ అని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు.
తాను అమరావతికి వ్యతిరేకమని జరిగిన ప్రచారం కూడా అవాస్తవమని.. తాను రాజధానికి మద్దతు ఇచ్చానన్నారు. ఎమ్మెల్సీ పదవి కోసం తాను ప్రయత్నం చేయలేదన్నారు. లాబీయింగ్ కూడా చేయలేదని.. పార్టీ నిర్ణయం మేరకు తనకు పదవి వచ్చిందన్నారు. సోము వీర్రాజుకు ఇప్పుడు తాను ప్రో వైసీపీ కాదని చెప్పుకోవడమే పెద్ద టాస్క్ గా మారింది. అయితే మాటల్లో ఆయన ఇలా చెప్పుకుంటే ఎవరూ నమ్మరు. చేతల్లో చూపించాల్సి ఉందని కూటమి నేతలంటున్నారు.