సోము వీర్రాజు వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారంటూ.. సోషల్ మీడియాలో ప్రచాంం జరుగుతూంటే.. ఆయన మాత్రం రివర్స్‌లో టీడీపీని ఖాళీ చేస్తామని ప్రకటిస్తున్నారు. గతంలో టీడీపీతో పొత్తులో ఉన్నప్పటికీ.. అధికార పార్టీ చేసే తప్పుల్ని ఎండగడతామని చెబుతూ.. తీవ్రమైన విమర్శలు చేసిన సోము వీర్రాజు..ఇప్పుడు.. అధికార పార్టీ కంటే.. ప్రతిపక్షాన్నే ఎక్కువగా విమర్శిస్తున్నారు. పైగా ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తామని భీకరమైన ప్రకటనలు చేస్తున్నారు. ప్రతిపక్షాన్ని లేకుండా చేయడానికి… ఆయన అధికార పార్టీ కూడా కదా.. అనే డౌట్ చాలా మందికి వస్తుంది. కానీ.. ఆయన తరచూ వైసీపీ నేతలతోనే.. సమావేశమవుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌తో కూడా సమావేశమై.. తన ఎజెండాను.. బయటకు వచ్చాక ప్రకటించారు కూడా. ఇప్పుడు.. మరింత దూకుడుగా.. టీడీపీని ఖాళీ చేస్తామనే ప్రకటనలు చేస్తున్నారు.
కొద్ది రోజులుగా గంటా శ్రీనివాసరావు.. బీజేపీ నాయకులను కలుస్తూ బిజీగా ఉన్నారు. విశాఖ లో భూకబ్జాల వ్యవహారంపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంతో ఎందుకైనా మంచిదన్నట్లుగా ఆయన టీడీపీలో చక్రాలు తిప్పి.. ఆనక బీజేపీలో చేరిపోయిన తన పాతమిత్రులు సీఎం రమేష్, సుజనా చౌదరిలతో కలిసి.. ఢిల్లీలో మకాం వేశారు. అమిత్ షా, మోడీ అపాయింట్మెంట్ల కోసం.. ప్రయత్నాలు చేశారు. ఇద్దర్నీ కలిశారు కూడా. దీంతో… గంటాకు కొంత ధైర్యం వచ్చింది. బీజేపీలో చేరకపోయినా.. ఆ పార్టీకి దగ్గరే అన్న భావన మాత్రం పంపుతున్నారు. దీనికే.. సోము వీర్రాజు రెచ్చిపోతున్నారు. గంటా శ్రీనివాసరావు తమను కలిశారని.. మిగతా వారిని కూడా లాగేస్తామని.. ఈ అసెంబ్లీలో తమకు ప్రాతినిధ్యం వస్తుందని.. ప్రకటించేస్తున్నారు.
సోము వీర్రాజు.. టీడీపీ ఎమ్మెల్యేల మద్దతుతో ఎమ్మెల్సీ అయ్యారు. కానీ బీజేపీ తరపున ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి ఎంటరవ్వాలంటే.. కచ్చితంగా ప్రజలు కమలం గుర్తుపై ఓట్లు వేయాలి. ఆ విషయాన్ని ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేల్ని చేర్చుకుని వారినే బీజేపీ సభ్యులుగా ప్రకటించుకుంటామంటూ.. సంబర పడిపోతున్నారు. అలా చేస్తే.. అనర్హతా వేటు వేస్తామని జగన్ చెబుతున్నారు. అలాంటి ప్రాబ్లం లేకుండా.. 23 మందినీ చేర్చేసుకుంటామని సోము వీర్రాజు… స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంటే.. ఆయన ఉద్దేశం.. చంద్రబాబును కూడా వదిలి పెట్టరన్నమాట.