వైసీపీని గద్దె దింపడానికి .. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు ప్రత్యేక రోడ్ మ్యాప్ బీజేపీ హైకమాండ్ ఇస్తామని చెప్పిన అంశంపై ఏపీ బీజేపీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. టీడీపీతో పొత్తు కోసం సుముఖంగా ఉన్నవారు.. స్వాగతించారు. కానీ సోము వీర్రాజు లాంటి వాళ్లు మాత్రం … ఆ రోడ్ మ్యాప్ లేదు..ఏమీ లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. రోడ్ మ్యాప్ రెండు నెలల క్రితమే తమకు ఇచ్చారని సోము వీర్రాజు విశాఖలో ప్రకటించేసుకున్నారు. అమిత్ షా తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడే పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలో రోడ్ మ్యాప్ ఇచ్చారని విశాఖలో సోము వీర్రాజు ప్రకటించారు.
2024 లోనే మేము అధికారంలోకి రావాలని జనసేనతో కలిసి ముందుకెళ్లే అంశంపై స్పష్టమైన సంకేతాలు మాకు అందాయని చెప్పుకొచ్చారు. ఆ దిశా నిర్దేశం ప్రకారమే మేము రాష్ట్ర వ్యాప్తంగా శక్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటుంటూ పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేస్తున్నామన్నారు. తామే ప్రత్యామ్నాయం అని చెప్పేసుకున్నారు. అయితే ఏమనుకున్నారో ఏమో కానీ మధ్యలో జనసేననూ కలుపుకున్నారు. రానున్న రోజుల్లో జనసేనతో కలిసి ఉద్యమాలను ఉదృతం చేసి అధికార పార్టీ కంటిపై కునుకు లేకుండా ప్రజల్లోకి వెళ్తామని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారు మా మిత్ర పార్టీ అధ్యక్షులు. వారితో మా కేంద్ర పార్టీ ప్రతినిధులు అన్ని విషయాలు మాట్లాడాతారన్నారు. బిజెపి-జనసేన మైత్రి మరింత బలపడుతుందని సోము వీర్రాజు చెబుతున్నారు.
ఏపీ బీజేపీ నేతలు తమకు రోడ్ మ్యాప్ అందిందని చెబుతున్నారు. అయితే అది వారి పార్టీకి సంబంధించిన రోడ్ మ్యాప్ కావొచ్చు. వైఎస్ఆర్సీపీని దింపేయడానికి.. ఓట్లు చీలకుండా ఏం చేయాలో ఇప్పుడు బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వాల్సి ఉంది. ఓట్లు చీలకూడదు అంటే విపక్షాలను కలుపుకుని పోవాలి. అంటే ఖచ్చితంగా టీడీపీతో కలిసి వెళ్లాలి. ఈ విషయంలో బీజేపీ నుంచి ఎలాంటి రోడ్ మ్యాప్ వస్తుందనేదానిపై పవన్ కల్యాణ్ తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. అది ఏపీ బీజేపీలోని కొంత మంది నేతలకు నచ్చేలా లేదు.