బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజుకు పార్టీ హైకమాండ్ అవకాశం కల్పించింది. ఆయన పేరును ఖరారు చేస్తూ అధికారికంగా ప్రకటించింది. సోమవారమే ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. గతంలో కూడా టీడీపీ, బీజేపీ కలసి పోటీ చేసినప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ వచ్చింది. అయితే ఆయన పదవి కాలంలో పదవి ఇచ్చిన టీడీపీ కోసం కాకుండా వైసీపీ కోసం పని చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఈ సారి కూడా పొత్తు లాభం సోము వీర్రాజుకు దక్కుతుంది. పొత్తులో భాగంగా ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. రాజమండ్రి రూరల్ టిక్కెట్ కోసం గట్టిగా ప్రయత్నించారు. కానీ పొత్తుల సమీకరణాల్లో ఆ సీటు దక్కలేదు. ఆనపర్తి సీటు కేటాయించారు. అక్కడి నుంచి పోటీ చేయడానికి ఆయన నిరాకరించారు. దాంతో నల్లిమిల్లిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చారు.
తాను త్యాగం చేసినందున తనకు అవకాశం కల్పించాలని ఆయన పట్టుబట్టినట్లుగా తెలుస్తోంది. ఆయనకు గతంలో అవకాశం వచ్చినందున ఇతరులకు అవకాశం కల్పించాలని అనుకున్నారు. క్రమశిక్షణా కమిటీ చైర్మన్ వెంట సత్యనారాయణ పేరు ఎక్కువగా వినిపించింది. సోము వీర్రాజు లాబీయింగ్ బలంగా పని చేసినట్లుగా కనిపిస్తోంది