ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాజకీయ తెలివి తేటలు మామూలుగా లేవు. ఏపీ సంగతేమో కానీ.. రాయలసీమ ప్రజల్ని సులువుగా రెచ్చగొట్టవచ్చని ఆయన అనుకుంటున్నారు. అందుకే ఎక్కువగా రాయలసీమలోనే కార్యక్రమాలు పెట్టుకుని అక్కడక్కడే తచ్చాడుతున్నారు. మామూలుగా అయితే ఎవరూ పట్టించుకోవడం లేదనుకుంటున్నారేమోకానీ… కోస్తా ప్రాంతంతో పోల్చి ప్రకటనలు చేయడం ప్రారంభించారు. అక్కడ మాత్రమే అభివృద్ధి చేస్తున్నారని రాయలసీమలో చేయడం లేదని చెప్పడం ప్రారంభించారు., వాటన్నింటితో పాటు… బీభత్సమైన రెచ్చగొట్టే ప్రకటనలను అనుకుని కొన్ని కామెంట్లు చేస్తున్నారు.
వాటిలో సోము వీర్రాజు కొన్ని ప్రకటనలు ఇవి. రాయలసీమ ప్రజలు ద్వితీయశ్రేణి పౌరులుగా కనిపిస్తున్నారా? … రాయలసీమ ప్రజల్లో దమ్ము లేదనుకుంటున్నారు..బీజేపీ ద్వారా చూపించండి..! బీజేపీకి అధికారం ఇవ్వండి..! లాంటివి. సోము వీర్రాజు చాలా సీరియస్గా వీటిని చెబుతున్నారు కానీ.. ఆయన ప్రకటనలు చూసి.. సీరియస్ కామెడీ అనుకుంటున్నారు బీజేపీ నేతలు. ఓటర్లను రెచ్చగొట్టడం అనే కాన్సెప్ట్ సోము వీర్రాజు లాంటి నేతలు అమలు చేస్తే.. ఇంతే కామెడీగా ఉంటుందనిఅంటున్నారు. మీకు దమ్ముంటే బీజేపీకి ఓటు వేయండి అని అడగడం .. మరీ ప్రజల్ని కామెడీగా చూస్తున్నట్లుగా ఉందని ఇతర బీజేపీ నేతలు గొణుక్కుంటున్నారు.
రాయలసీమ అభివృద్ధిపై జగన్, చంద్రబాబు తనతో చర్చకు రావాలని కూడా సోము వీర్రాజు ప్రకటనలు చేస్తున్నారు. అసలు రాయలసీమకు సంబంధించి సోము వీర్రాజు కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉంటే అలాంటి ప్రకటన చేసినా ఓ అర్థం ఉండేది. కానీ ఆయనకు రాయలసీమ జిల్లాలకు ఎలాంటి సంబంధం లేదు. అయినా రాయలసీమకు చెందిన చంద్రబాబు, జగన్లను చర్చకు రావాలని సవాల్ చేసేస్తున్నారు. జగన్, చంద్రబాబు రాయలసీమ మోసగాళ్లని కూడా అంటున్నారు. మొత్తానికి సోము వీర్రాజు.. సరిపడని డైలాగులతో కామెడీ చేస్తున్నారన్న చర్చ మాత్రం.. బీజేపీలో ప్రారంభమయింది.