ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా ఈరోజు అధికారికంగా పగ్గాలు చేపట్టారు సోము వీర్రాజు. పార్టీని 2024లో అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో విలేకరులతో మాట్లాడుతూండగా, ఇటీవల చిరంజీవిని కలవడంపై వారు లేవనెత్తిన ప్రశ్నలకు వివరణ ఇచ్చారు సోము వీర్రాజు. వివరాల్లోకి వెళితే..
సోము వీర్రాజు మొదటి నుండి దూకుడు మనస్తత్వం కలిగిన నాయకుడు. ప్రస్తుతం బీజేపీని ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేయాలంటే ఇటువంటి దూకుడు అవసరమని గుర్తించిన కేంద్ర పెద్దలు సోము వీర్రాజు కు అధికార పగ్గాలు ఇచ్చారు. నిర్ణయం వెలువడిన నాటి నుండి సోము వీర్రాజు తనదైన శైలిలో పావులు కదుపుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంటికి వెళ్లి సోము వీర్రాజు కలవడం చర్చకు దారి తీసింది. నిజానికి చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినప్పటికీ ఆయన రాజకీయాల్లో చురుగ్గా లేరు, పైగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో కూడా పాల్గొనడం లేదు. ఇక సోము వీర్రాజు కు మొదటి నుండి చిరంజీవి కుటుంబంతో ఉన్న వ్యక్తిగత అనుబంధం మేరకు ఆయన చిరంజీవి ని కలిసి వచ్చారు. సోము వీర్రాజు చిరంజీవి ని కలవడం ఇటు చిరంజీవి అభిమానులకు కానీ, అటు బిజెపి అభిమానులకు కానీ పెద్దగా ఇబ్బంది అనిపించలేదు కానీ విపక్ష పార్టీల అభిమానులకు మాత్రం అది పెద్దగా రుచించలేదు. పైగా అసలు సోము వీర్రాజు చిరంజీవి ని కలవడం ఏంటని రకరకాల లాజిక్కులు తీస్తూ వారు విమర్శలు చేశారు. ఇదే విషయాన్ని ఈ రోజు సోము వీర్రాజు తో విలేకరులు ప్రస్తావించారు. చిరంజీవిని బిజెపిలోకి ఆహ్వానించారా అని కూడా వారు ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానమిస్తూ- 2009లో పార్టీ పెట్టి 18 శాతం ఓట్లు సాధించిన వ్యక్తి చిరంజీవి అని, ఇప్పటివరకు కూడా పలు రాజకీయ అంశాలపై ఆయనకి చక్కటి అవగాహన ఉందని, అందుకే ఆయనను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నానని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. జనసేన బీజేపీలు కలిసి మెలసి ముందుకు సాగాలని చిరంజీవి దిశానిర్దేశం చేశారు అని కూడా సోము వీర్రాజు తెలియజేశారు.
మొత్తానికి సోము వీర్రాజు చిరంజీవి భేటీ రాజకీయవర్గాల్లో లేవనెత్తిన చర్చకు సింపుల్ గా అలా చెక్ పెట్టేశారు సోము వీర్రాజు.