కొంత విరామం తరువాత ముఖ్యమంత్రిపై విమర్శల కార్యక్రమాన్ని భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు పునః ప్రారంభించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకి లేదని విమర్శించారు. అక్కడి గవర్నర్ కు కొన్ని ఆలోచనలు ఉంటాయనీ, వాటి ప్రకారం నిర్ణయాలుంటాయని చెప్పారు. 1994లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని చీల్చిన చంద్రబాబుకి కర్ణాటక ఫలితాలపై మాట్లాడే హక్కు లేదన్నారు. నేషనల్ ఫ్రెంట్ కన్వీనర్ గా చంద్రబాబు ఉన్నప్పుడు వాజ్ పేయికి మద్దతు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ కి అనుకూలంగా వ్యవహరించి, దేవెగౌడను ప్రధాని చేశారన్నారు. ఆ తరువాత, గుజ్రాల్ కి మద్దతు ఇచ్చారన్నారు.
ఆయన మొదట్నుంచీ కాంగ్రెస్ తో అంటకాగుతూ వచ్చారనీ, ఇప్పుడు కూడా కర్ణాటకలో కాంగ్రెస్ మద్దతున్న ప్రభుత్వమే అధికారంలోకి రావాలని ఆశిస్తున్నారని వీర్రాజు విమర్శించారు. ఏదేమైనా కర్ణాటకలో భాజపా గెలవకూడదన్నదే చంద్రబాబు ఉద్దేశమన్నారు. ఏపీలో పాలనపై పూర్తిగా పట్టుకోల్పోయారనీ, రాష్ట్రంలోకి భాజపాని రానీయకూడదన్నది ఒక్కటే కార్యక్రమంగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఎంతసేపూ మోడీ మీద విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు అన్నారు. ఆంధ్రాలోకి భాజపా వచ్చేస్తుందేమో అనే భయంతోనే ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ ప్రజలను రెచ్చగొడుతున్నారని వీర్రాజు విమర్శించారు.
ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని చీల్చారు కాబట్టి, కర్ణాటక ఫలితాల గురించి మాట్లాకూడదట! నిజానికి, ఈ రెంటికీ సాపత్యం ఎక్కడుంది..? టీడీపీ పగ్గాలు చంద్రబాబు చేపట్టినా, పరిపూర్ణ సంఖ్యాబలంతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు, ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో మరోసారి టీడీపీ అధికారంలోకి వచ్చింది. కానీ, ఇప్పుడు కర్ణాటకలో సీన్ అది కాదు కదా! అధికారం కోసం కావాల్సిన సంఖ్యాబలం కోసం ఇతర పార్టీల నేతల్ని లాక్కునే పని భాజపా చేస్తోంది. సంఖ్యాబలం లేదని తెలిసి కూడా ఎడ్యూరప్పతో ప్రమాణ స్వీకారం చేయించడం నైతికతా..? ఇతర పార్టీల నేతల్ని లాక్కోవాలనుకోవడం నైతికతా..? అన్ని రాష్ట్రాల్లో భాజపాని ప్రజలు ఆమోదిస్తున్నారు అని చెబుతున్నారే… గత ఏడాదిన్నర, రెండేళ్లకాలంలో ఎన్ని రాష్ట్రాల్లో క్లీన్ గా భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది..? ఈ ప్రశ్నకు వీర్రాజు సమాధానం చెబితే బాగుంటుంది. ఇంకోటి… ఆంధ్రాలో భాజపా ప్రవేశిస్తుందేమో అనే భయంతోనే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని చేస్తున్నారన్నారు. అది మోడీ ఇచ్చిన హామీ అనే విషయానికి వీర్రాజు మరిచిపోతే ఎలా..?