నిజమైన ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషించేందుకు ఏపీలో భాజపా రెడీ అవుతోందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా, పోలవరం గురించి ప్రస్థావించారు. పనులు ఆలస్యం కావడానికి గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరే కారణం అన్నారు. అదేంటీ.. అది జాతీయ ప్రాజెక్టు కదా, బాధ్యత కేంద్రానికి ఉండాలి కదా అనే డౌటు సహజంగానే అందరికీ వస్తుంది. అయితే, కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా నాడు నితిన్ గట్కరీ బాధ్యతలు తీసుకునే వరకూ పోలవరం పనుల్లో పురోగతి లేకుండా పోయిందనే కారణం చెప్పారు వీర్రాజు. సరే, ఆయనొచ్చాక ఏం జరిగిందనేది మాత్రం వీర్రాజు చెప్పలేదు. 2014 నుంచి అవినీతి పెరిగిపోయిందనీ, చినబాబు (లోకేష్) రాకతో అది మరింత ఎక్కువైపోయిందని ఆరోపించారు.
ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ పనైపోయిందనీ, చంద్రబాబు నాయుడు మీద ఎవ్వరికీ నమ్మకం లేదని టీడపీ వాళ్లే చర్చించుకుంటున్నారన్నారు సోము వీర్రాజు. గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబుకి అలవాటనీ, ఓడిపోయినా కూడా ఇంకా అదే ధోరణిలో ఉన్నారనీ, చంద్రబాబు ఇప్పటికీ మారకపోవడంతో టీడీపీని వదిలి చాలామంది తమ పార్టీలో చేరుతున్నారన్నారు. ఆ పార్టీ ముందుకు వెళ్లే అవకాశం లేదు కాబట్టి, పార్టీలో కార్యకర్తలూ నాయకులూ భాజపాలోకి వచ్చి చేరాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ, ఇప్పుడు అదే కాంగ్రెస్ తో జత కట్టిందనీ, తాము దేశంలో ఎప్పటికీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగానే పోరాటం చేస్తాం కాబట్టి… టీడీపీలో ఉన్నవారంతా ఇప్పుడు భాజపాలోకి వచ్చేయడం సరైన నిర్ణయం అవుతుందన్నారు. అనేకమంది చేరికలు మున్ముందు ఉంటాయనీ, ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇది టీడీపీ మీద కక్ష సాధింపు కాదనీ, తాము బలపడే ప్రయత్నం అని చెప్పుకొచ్చారు.
మొత్తానికి, ఏపీ టీడీపీ వర్గాల్లో ఒక రకమైన అభద్రతా భావాన్ని క్రియేట్ చేయడమే భాజపా నేతల వ్యూహంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో పుట్టిన టీడీపీ, ఆ పార్టీతోనే కలిసింది కాబట్టి… ఆ మూల సూత్రాన్ని వ్యతిరేకించేవారంతా భాజపాలోకి వచ్చేయాలంటున్నారు సోము వీర్రాజు! ఇది ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి. ఆ మధ్య ఓ భాజపా నాయకుడు వచ్చి… రెండేళ్లలో చంద్రబాబు జైలుకి వెళ్లడం ఖాయమన్నారు. గతవారంలో రాష్ట్రానికి వచ్చిన రామ్ మాధవ్… రాష్ట్రంలో లేదన్న భాజపాని, వచ్చే ఎన్నికల నాటికి ఎలా తయారు చేస్తామో చూడండి అంటూ సవాల్ చేశారు. చంద్రబాబు అవినీతిని వెలికి తీసి, కేంద్రానికి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మరో భాజపా నేత వ్యాఖ్యానించారు. ఓవరాల్ గా, టీడీపీలో ఒకరకమైన అభద్రతా భావాన్ని సృష్టించి, నాయకుల్నీ కేడర్ నీ పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నమే భాజపా చేస్తోంది.