ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు. సచివాలయం ప్రాంగణంలో నాయీ బ్రాహ్మణ నేతలపై సీఎం ఆగ్రహించిన అంశాన్ని వీర్రాజు ప్రస్థావించారు. వారి కోర్కెలపై స్పందించిన తీరు గమనిస్తే, భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ఈవిధంగా వ్యవహరించిన దాఖలాలు లేవన్నారు! ముఖ్యమంత్రి హోదాను మరచిపోయి నడిరోడ్డు మీద, అవతలి వ్యక్తుల వృత్తికి గౌరవం ఇవ్వకుండా వ్యవహరించారన్నారు. అంతేకాదు, ఒక వీధి రౌడీ మాదిరిగా బెదించారని విమర్శించారు. ఇది చూశాక 40 ఏళ్ల ఆయన రాజకీయ అనుభవం ఏమైందని ప్రశ్నించారు. ఆయన ప్రవర్తన చూస్తే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.
వారిపై మీదపడి కొడతా అన్నట్టుగా దబాయించిన తీరును తాను తీవ్రంగా ఖండిస్తున్నా అని వీర్రాజు అన్నారు. నాయీ బ్రాహ్మణుల హక్కుల్ని వెంటనే పరిష్కరించాలనీ, సీఎం వెంటనే స్పందించి వారికి క్షమాపణలు చెప్పాలని భాజపా డిమాండ్ చేస్తోందన్నారు. ముఖ్యమంత్రిగా పదేళ్ల ఉన్నానని చెప్పుకునే నాయకుడు ప్రవర్తించాల్సిన తీరేనా ఇదీ అని ప్రశ్నించారు.
వాస్తవం ఏంటంటే… సచివాలయంలో సీఎంను నాయి బ్రాహ్మణ నేతలు సోమవారం నాడు అడ్డగించిన సంగతి తెలిసిందే. దేవాలయాల్లో కేశ ఖండన చేస్తున్నవారికి నెలవారీ జీతాలు ఇవ్వాలన్న డిమాండ్ తో వారొచ్చారు. అయితే, అది సాధ్యం కాదని సీఎం అన్నారు. అంతేకాదు, ప్రస్తుతం కేశ ఖండన టికెట్ కు కొన్ని చోట్ల రూ. 13 మాత్రమే ఉంటే.. దాన్ని దాదాపుగా డబుల్ చేసి, అంటే రూ. 25 ఇవ్వబోతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ భారం ప్రజలపై పడకుండా.. దేవాలయాలే భరించాలని కూడా సూచించారు. అయితే, అక్కడికి వచ్చిన క్షురకులను తమని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ పదేపదే పట్టుబట్టారు. అది సాధ్యమయ్యే పని కాదన్నారు.
అయినాసరే, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనాలు ఇవ్వాలంటూ పదేపదే డిమాండ్ చేసేసరికి సీఎం ఆగ్రహించారు. ప్రాక్టికల్ గా అది సాధ్యం కాదనీ, నిబంధనలు అడ్డొస్తాయనీ, కేశ ఖండన టిక్కెట్ ను డబుల్ చేసినందుకు సంతోషించాలనీ, ఇతర సమస్యల ఉంటే తాను మాట్లాడతానని భరోసా ఇచ్చారు. న్యాయమైన డిమాండ్లు ఉంటే తప్పక పరిష్కరిస్తా అన్నారు. ప్రభుత్వాన్ని బెదిరిస్తే సహించేది లేదన్నారు. ఇదీ జరిగింది. అంతేగానీ, సోము వీర్రాజు చెబుతున్నట్టు అవతలి వ్యక్తి వృత్తిని అగౌరవ పరిచే విధంగా అక్కడేం జరగలేదు. అంశాలవారీగానే ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.