పవన్ కల్యాణ్, చంద్రబాబు మూడో సారి సమావేశం కావడం… వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపైనే తాము చర్చించుకుంటున్నామని నాదెండ్ల మనోహర్ ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి బీజేపీపై పడింది. బీజేపీ నేతల స్పందన ఏమిటా అని ఆసక్తిగా చూశారు. ప్రో వైసీపీ నేతగా ముద్రపడిన సోము వీర్రాజు .. అవునా.. వాళ్లు భేటీ అయ్యారా .. నాకు తెలియదే అన్నట్లుగా స్పందించారు. ఈ అంశంపై ఆయన నిరాశకు గురయ్యారని.. స్పందించడానికి వ్యతిరేకంగా ఉన్నారని స్పష్టమయింది. అయితే జనసేన తమతోనే ఉందని గతంలోలా కాన్ఫిడెంట్‌గా చెప్పలేకపోయారు.
మరో బీజేపీ నేత , జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కూడా స్పందించారు. ఆయన మరింత భిన్నంగా స్పందించారు. వైసీపీ విముక్త ఏపీ అన్నదే బీజేపీ లక్ష్యం కూడా అని స్పష్టం చేశారు. జనసేన స్వతంత్ర పార్టీ అని.. ఆ పార్టీ అధినేత ఎవరితోనైనా చర్చించవచ్చని స్పష్టం చేశారు. ఢిల్లీకి వచ్చి బీజేపీ అగ్రనేతలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారని గుర్తు చే్శారు. వైసీపీని ఓడించడానికి ఓట్లు చీలికపోకూడదనేది పవన్ లక్ష్యమని ఆ దిశగా ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. సత్యకుమార్ మాటల్లో.. పవన్ ప్రయత్నాలపై బీజేపీ సానుకూలంగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
కారణం ఏదైనా ఏపీ బీజేపీలో వైసీపీకి దగ్గర అనుకున్న నేతలు మాత్రం పొత్తులు వద్దని .. జనసేనతో మాత్రమే కలిసి పోటీ చేద్దామని అంటున్నారు. కానీ ఇతర నేతలు మాత్రం.. వైసీపీని ఓడించడానికి . .. కనీసం అసెంబ్లీలో ప్రాతినిధ్యం దక్కడానికి టీడీపీతో పొత్తు ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఢిల్లీ నుంచి వస్తున్న సంకేతాలతో ప్రో వైసీప నేతలు సైలెంట్‌గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.