బిజెపి నాయకుడు సోము వీర్రాజు టిడిపిపై విమర్శలు చేయడం, దానికి వెంటనే బుద్దా వెంకన్న వంటివారు స్పందించడం ఇదంతా ఒక దండగమారి వ్యవహారం. ఈసారి వీర్రాజు విమర్శల శ్రుతి పెంచారు గనక టిడిపి కూడా మంత్రి కాలువ శ్రీనివాసులును రంగంలోకి దింపింది. ఆయన అధికారికంగా మాట్లాడుతున్నానని చెబుతున్న సంగతి మంత్రి బిజెపి నేతలకు గుర్తు చేశారు. అది వారికి తెలియదా? ఇంతలోనే వీర్రాజు వ్యాఖ్యలపై స్పందన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్టు మరో కథనం. వాస్తవానికి కేంద్ర బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైన పరిస్థితి నుంచి దృష్టి మరల్చడానికే బిజెపి ఈ నాటకం నడిపిస్తుంటే టిడిపి కూడా దాన్ని రక్తి కట్టిస్తున్నది. తమలో తాము కీచులాడుకున్నట్టు కనిపించి ఆ పైన అధిష్టానాల మధ్య రాజీ కుదిరిందని సర్దుకుంటారు. ఈ మధ్యలో సమస్యలపైనా ఏదో ప్రకటనచేయిస్తారు. ఇప్పుడు సమస్య తీవ్రంగా వుంది గనక వీర్రాజు విజృంభణ కూడా ఎక్కువగానే వుంది. అయితే ఆయన బడ్జెట్‌పై గాక ఇతర పాత విషయాలపై మాట్లాడుతుంటే టిడిపి వారు మిత్ర ధర్మంతో ప్రతిస్పందిస్తున్నారట.