భాజపా నేత సోము వీర్రాజు మరోసారి మాట్లాడారు! సందర్భం… కేంద్రమంత్రి నితిన్ గట్కరీ పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. రాజకీయాలతో సంబంధం లేకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని నితిన్ గట్కరీ చెప్తే… పోలవరం అనేది ఫక్తు రాజకీయాంశంగా ఏపీ నేతలు చూస్తున్నారు! పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నది ప్రధాని మోడీ అనే విషయాన్ని ప్రజల్లోకి ప్రచారంగా తీసుకెళ్లాలని భాజపా కార్యకర్తలకు నితిన్ గట్కరీ చెబితే… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు వల్లనే ఆలస్యమైందని రాష్ట్రనేతలు అంటున్నారు!
ఏపీలో రెండు శాతం ఓట్లు భాజపాకి రావని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారనీ, కానీ రోజూ భాజపా, మోడీ గురించే ఆయన మాట్లాడుతున్నారనీ, ఇంతకంటే సంతోషించదగ్గ విషయం ఏముంటుందని వీర్రాజు అన్నారు. ఈరోజున ఏపీలో భాజపాకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గౌరవ ప్రధాన ప్రచార కార్యదర్శి అని వీర్రాజు ఎద్దేవా చేశారు! ఆంధ్ర రాష్ట్రంలో మోడీ లేకపోతే చంద్రబాబు నాయుడు జీరో అన్నారు. ఆంధ్రాలో మోడీ హీరో అన్నారు. రాష్ట్రంలో చెరువులు తవ్వే కార్యక్రమానికి రూ. 13 వేల కోట్లు ఖర్చుపెట్టారనీ, దాంతో పోలవరం పనులు అయిపోయేవని అన్నారు. కేంద్రం ఇచ్చిన సబ్సిడీలు, నిధులు, పథకాలూ అన్నీ తినేస్తున్నారని ఆరోపించారు.
గుజరాత్ లో 90 శాతం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారనీ, ఆంధ్రాలో ఆ పరిస్థితి లేదన్నారు. చంద్రబాబుకి, మోడీకి ఎంత గొప్ప వ్యత్యాసమో చూడాలన్నారు! చంద్రబాబు అవినీతి గురించి చెప్తూ పోతే రాత్రీ పగలూ చాలదన్నారు! భాజపా అన్ని రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం చేసిన కార్యక్రమాల గురించి గ్రామాల్లో ప్రచారం చేయాలనీ, ఏపీకి మోడీ చేసినవేంటో మనం మాట్లాడటం మొదలుపెడితే టీడీపీ కార్యకర్తలు మాట్లాడలేరని వీర్రాజు అన్నారు. అంతకుముందు, పోలవరం గురించి కూడా మాట్లాడుతూ… భారతీయ జనతా పార్టీ మాత్రమే మొదట్నుంచీ ప్రాజెక్టుకి కట్టుబడి ఉందని చెప్పారు.
ఆంధ్రాకి మోడీ చేసినవి ప్రచారం చేయడం మొదలుపెడితే.. మాట్లాడేవారే ఉండరని వీర్రాజు ఘనంగా చెప్పారు! బాగుంది.. కానీ, రైల్వేజోన్ గురించి, కడప ఉక్కు కర్మాగారం గురించి, ప్రత్యేక హోదాతోపాటు ఇతర విభజన హామీల గురించి కూడా మోడీ ఏం చేశారో వీర్రాజు ప్రజలకు చెప్తే బాగుంటుంది. ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాలంటూ పంపిస్తున్న కార్యకర్తలకు ఈ విషయమై శిక్షణ ఇచ్చి పంపితే మరీ బాగుంటుంది! లేదంటే, ఈ ప్రశ్నలకు వాళ్ల దగ్గర సమాధానాలు లేకపోతే బాగోదు కదా!