ప్రత్యేక హోదా గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత రెండేళ్ళలో ఎన్ని సార్లు ఎన్నెన్ని రకాలుగా మాట్లాడారో అందరికీ తెలుసు. తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలు వింటే తెలుస్తుంది. తెదేపా, భాజపాలు ప్రస్తుతం లాంఛనంగా యుద్ధ ప్రకటన చేసినట్లే వ్యవహరిస్తున్నాయి కనుక, తెదేపా నేతల విమర్శలకు భాజపా నేతలు కూడా సమాధానాలు చెప్పడం మొదలుపెట్టారు. జగన్ తరువాత చంద్రబాబూని విమర్శించేవారిలో సోము వీర్రాజు కూడా ఒకరు. జగన్ శత్రుపక్షానికి, సోము వీర్రాజు మిత్రపక్షానికి చెందడం ఒక్కటే తేడా తప్ప ఆ ఇద్దరికీ చంద్రబాబు నాయుడుపై సదాభిప్రాయం లేదనే సంగతి వారి మాటలలో బయటపడుతూనే ఉంటుంది.
ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్రంలో మళ్ళీ యుద్ధం మొదలయినప్పటి నుంచి నిన్నటి వరకు సోము వీర్రాజు నోరు విప్పలేదు. కావలి పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ప్రత్యేక హోదా ఏమయినా సంజీవినినా? హోదా పొందిన రాష్ట్రాలు కూడా ఇంకా వెనకబడి ఉన్నాయి. హోదా వస్తుందా రాదా అనే దాని కంటే రాష్ట్రం ఏవిధంగా అభివృద్ధి చేసుకోవాలి అనేదే చాలా ముఖ్యం,’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఎన్నోసార్లు అన్నారు. మళ్ళీ ఆయనే ఇప్పుడు ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్రం చాలా తీవ్రంగా నష్టపోతుందన్నట్లు మాట్లాడుతున్నారు. ఒకే విషయంపై ఆయన ఇన్ని రకాలుగా ఎందుకు మాట్లాడుతున్నారు? రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తున్న మాట వాస్తవమా కాదా? కేంద్ర ప్రభుత్వం సహాయం పొందుతూనే ముఖ్యమంత్రి దానిపై నిందలు వేయడం సబబు కాదు,” అని అన్నారు.
మనిషి నచ్చకపోతే ‘రామా’ అన్నా కూడా అది బూతు పదంలాగే వినిపిస్తుందన్నట్లు, ఇంతవరకు తెదేపా, భాజపాల మద్య సక్యత ఉంది కనుక భాజపా నేతలకు చంద్రబాబు నాయుడు హోదా గురించి చెప్పిన ఆ మాటల్లో తప్పు కనబడలేదు. కానీ ఇప్పుడు యుద్ధ భేరీలు మ్రోగగానే వాటికి వేరే అర్ధాలు కనబడతున్నాయి. ఇదే సూత్రం చంద్రబాబు నాయుడుకీ వర్తిస్తుంది. ఇంతకాలం భాజపాతో అంటకాగినప్పుడు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం అని ఆయనకి అపించలేదు. కానీ యుద్ధ భేరీలు మ్రోగగానే ప్రత్యేక హోదాతో సహా అన్నీ హామీలు గుర్తుకు వస్తున్నాయి.
ఆ రెండు పార్టీలు ఒకదానినొకటి పొగుడుకొంటూ, అప్పుడప్పుడు ఈవిధంగా విమర్శించుకొంటూ ప్రజలని మభ్య పెడుతూ రెండేళ్ళు కాలక్షేపం చేసేసాయి. మిగిలిన మూడేళ్ళు కూడా ఇలాగే కాలక్షేపం చేసేయవచ్చు లేదా విడిపోయి ఒకదానిపై మరొకటి తీవ్ర విమర్శలు చేసుకొంటూ కాలక్షేపం చేసినా ఆశ్చర్యమేమీ లేదు. కానీ వాటి మాటలకు రాష్ట్ర ప్రజలు బుట్టలో పడిపోతారనో లేదా తమ ఎత్తులను అర్ధం చేసుకోనే జ్ఞానం వారికి లేదనో భావిస్తే అందుకు అవే మూల్యం చెల్లించవలసి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అతి తెలివి ప్రదర్శించబట్టే ప్రజలు దానికి గుణపాఠం చెప్పారని తెదేపా నేతలే భాజపాకి హెచ్చరిస్తున్నారు. ఆ హెచ్చరిక వారికీ వర్తిస్తుందని గ్రహిస్తే మంచిది.