హైదరాబాద్: ప్రత్యేకహోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇవాళ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ మిత్రధర్మం పాటించటంలేదని అన్నారు. అధికారయంత్రాంగంపై ప్రభుత్వం పట్టుకోల్పోయిందని విమర్శించారు. ధరలను అదుపుచేయటంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఏపీ ప్రభుత్వ నేతలు ఎప్పుడూ కష్టాల్లోనే ఉన్నామని చెప్పుకోవటం దురదృష్టకరమని అన్నారు. ప్రత్యేకహోదా రాలేదని పదేపదే చెప్పేవారు వచ్చినదానిని ఎందుకు ప్రస్తావించరని ప్రశ్నించారు. కష్టాలలో ఉంటే రు.1,600 కోట్లు పెట్టి గోదావరి పుష్కరాలను ఎందుకు చేశారని అడిగారు. ప్రత్యేకహోదా వచ్చి తీరుతుందని చెప్పారు. ఇప్పటికే బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ పుష్కరాలకు ముందు తెలుగుదేశంప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సోము వీర్రాజుకూడా అదేస్థాయిలో విమర్శలు చేశారు. మరి వీరు పార్టీ కేంద్ర నాయకత్వం ఆమోదంతోనే ఈ విమర్శలు చేస్తున్నారా, లేక వ్యక్తిగత స్థాయిలో చేస్తున్నారా అనేది ఇంకా తెలియటంలేదు.