ఆంధ్రప్రదేశ్లో జెండా పాతాలని ఏపీ బీజేపీ నేతలు తహతహలాడిపోతూంటే.. మరో వైపు ఢిల్లీ నేతలు మాత్రం.. ఏపీ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని… ఇక్కడి నేతల్ని చిక్కుల్లో పడేస్తున్నారు. ఓ వైపు అమరావతికి మద్దతుగా ఉండమని ఇక్కడి నేతలు సంకేతాలు ఇస్తారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకంగా తీసుకునే ప్రతీ నిర్ణయానికి అండగా నిలుస్తూంటారు. దీంతో బీజేపీ నేతలు ప్రజల్లో చులకన అవుతున్నారు తప్ప… పలుకుబడి పెరగడం లేదు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలోనూ అదే పరిస్థితి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం… సెంటిమెంట్ గా మారింది. డిజిన్వెస్ట్ మెంట్ అంటే.. పది శాతమో.. ఇరవై శాతమో వాటాలు అమ్మితే పెద్దగా వ్యతిరేకత వచ్చేది కాదేమో కానీ ఇప్పుడు మొత్తంగా.. గుంపగుత్తగా ప్లాంట్ నే అమ్మకానికి పెట్టేశారు.
స్టీల్ ప్లాంట్ కు ఉన్న భూములు.. ఆస్తుల విలువతో పోల్చితే.. కంపెనీకి వచ్చిన నష్టాలు పిసరంతే. అసలు అమ్మకానికి నష్టాలు కారణం కాదని… నష్టాలు రాని ఎల్ఐసీ లాంటి కంపెనీల్లో వాటాలను ఎందుకు అమ్ముతున్నారన్న వాదనలు సామాన్యుల్లో వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏపీ బీజేపీ నేతలపై ఒత్తిడి పెరిగిపోంది. ఏపీలో అన్ని పార్టీలతో పాటు తాము కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని ప్రకటనలు చేయాల్సి వచ్చింది. ప్రకటనలు చేస్తే… నమ్మే రోజులు లేకు కాబట్టి… ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలుస్తామని ప్రకటిచారు. పధ్నాలుగో తేదీన వెళ్లి కలుస్తామని చెప్పినా.. ఒక రోజుతర్వాత ఢిల్లీ బయలుదేరుతున్నారు. వారికి ఢిల్లీలో అపాయింట్ మెంట్లు దొరుకుతాయో లేదో ఎవరికీ తెలియదు.
ఎవరో ఒకరిని కలిసి వినతి పత్రం ఇస్తేనే గొప్ప. ఏపీలో పరిస్థితి ఇలా ఉందని చెప్పి.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేసే పరిస్థితి లేదు. కానీ తమ ప్రయత్నం తాము చేయకపోతే ప్రజల్లో చులకన అయిపోతామని బీజేపీ నేతలు బయలుదేరుతున్నారు. నిజంగా … వారు హైకమాండ్ ఆలోచనల్ని మార్చి.. ప్రైవేటీ కరణపై వెనక్కి తగ్గుతున్నామన్న ప్రకటన చేయిస్తే.. రాజకీయంగా బీజేపీకి చాలా ప్లస్ అవుతుంది. కానీ కేంద్రం ఈ విషయంలో ఇప్పటికే చాలా అడ్వాన్స్ స్టేజ్ కు వెళ్లిందన్న ప్రచారం జరుగుతోంది. మరి ఏపీ బీజేపీ నేతల మాటలను.. ఆందోళనలను.. రాజకీయ భవిష్యత్ ఆశలను పట్టించుకుంటారా.. అన్నదే ఆసక్తికరం.