తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక గజిబిజిని ఆధారం చేసుకుని ఎపి బిజెపి నేతలు చెలరేగిపోతున్నారు. గతంలో కేంద్రం నుంచి అందిన సహాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలాసార్లు పొగిడారని క్లిప్పింగులు చూపిస్తున్నారు. తాజాగా సోము వీర్రాజు నాటకీయంగా చాలా మాట్లాడారు. ఆవూరికి ఈ వూరెంత దూరమో ఈ వూరికి ఆ వూరూ అంతే. చంద్రబాబు పొగడ్తలు సన్మానాలూ నిజమే . కాని కేంద్రం నుంచి వచ్చిన బిజెపి నేతలు కూడా ఆయనపై పొగడ్తలు కురిపించి వెళ్లారే? ఇప్పుడు ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్యనాయుడైతే నెలకోసారి వచ్చి ఆకాశానికెత్తేవారు.చంద్రబాబు డైనమిక్ సిఎం. మోడీ వచ్చాక ప్రపంచమంతా దేశం వైపు చూస్తుంటే దేశం మాత్రం ఎపి వైపు చూస్తోంది అని ఆయన సూక్తి. సమస్యలున్నా గొప్పఅభివృద్ధి చేస్తున్నారని ఎన్నిసార్లు చెప్పారో లెక్కలేదు.విట్ శంకుస్తాపనలోనూ విశాఖలో భాగస్వామ్య సదస్సులోనూ ఇదే జరిగింది. ఒకసారి వెంకయ్య ప్రత్యేకంగా తన కార్యక్రమం మార్చుకుని తాత్కాలిక సచివాలయం సందర్శించి పొగిడేశారు. ఇప్పుడు బిజెపి నేతలు దాన్నే తప్పు పడుతున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కూడా పలుసార్లు కితాబులిచ్చారు. మరో మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్ర మంత్రిలాగే అన్నీ కలిసి చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 2017 బడ్జెట్ తర్వాత మంత్రి సుజనా చౌదరి నాయకత్వంలో జైట్లీని ప్రత్యేకంగా కలిసి ప్రశంసించి కృతజ్ఞతలు చెప్పి వచ్చారు.ఇలా చేయవలసినవన్నీ చేసి ఇప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటే ఎవరినైనా ఎందుకు నమ్మాలి? పైగా ఇప్పుడు కూడా రాజీనామాలు అవిశ్వాసం వుండబోవనీ ప్రత్యేక హౌదాకు సమానమైన ప్రయోజనం కలిగిస్తే ఫర్వాలేదని సంకేతాలిచ్చాక కేంద్రం ఎందుకు దిగివస్తుంది? అక్కడ తమ పార్టీ వుండి చేయవలసింది చేయనప్పుడు సోము వీర్రాజు వంటివారు రెండు చోట్ల ఉభయులం వున్నామనే మాట మర్చి వూగిపోతే ఉపయోగమేమిటి?