ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వేడి మీద ఉన్నారు. టీడీపీతో దగ్గరగా ఉన్నారని భావించిన వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. అసలు ఆంధ్రజ్యోతి ఆర్కే ఇంటర్యూలో ఏం చెప్పారో చూడకుండానే విష్ణుకుమార్ రాజుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో టీజీ వెంకటేష్ ఫోటో ఉందని ఆయనకూ నోటీసులు జారీ చేశారు సోము వీర్రాజు.
ఫ్లెక్లీల్లో ఫోటోలు ఎవరైనా వేసుకోవచ్చు. అంతమాత్రాన అది టీజీ వెంకటేష్ వేయించుకున్నట్లు కాదు. నిజానికి ఆయన కుమారుడు టీడీపీలో ఉన్నారు. టీడీపీ తరపునే కర్నూలు సిటీ నుంచి పోటీ చేయనున్నారు. నారా లోకేష్ పాదయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కొంత మంది టీజీ వెంకటేష్ ఫోటోను కూడా ఫ్లెక్సీల్లో వాడుకున్నారు. ఇది సోము వీర్రాజుకు మంట పుట్టించింది. ఉంటే గింటే వైసీపీ ఫ్లెక్సీల్లో ఉండాలనుకున్నారేమో కానీ వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేసేశారు.
అయితే అటు విష్ణుకుమార్ రాజుకు అయినా.. టీజీ వెంకటేష్ కు అయినా షోకాజ్ నోటీసులు జారీ చేసేంత అధికారం సోము వీర్రాజుకు ఉందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. తాను ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయిన కొత్తలో సోము వీర్రాజు చాలా మందిని సస్పెండ్ చేసి పడేశారు. అమరావతికి మద్దతుగా మాట్లాడిన వారిని.. వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారినీ పంపేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. తమ నేతలు ఎవరైనా టీడీపీకి దగ్గరగా ఉంటే వారనందర్నీ సాగనంపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత వరకూ వర్కవుట్ అవుతాయో కానీ సోము వీర్రాజు తన నోటీసుల్ని శరవేగంగా జారీ చేసేస్తున్నారు.