ఒక్క ఓటు వేస్తే చీప్ లిక్కర్ రూ. 70కి .. కాదంటే రూ. 50కే ఇస్తామని సోము వీర్రాజు వీరావేశంతో ఇచ్చిన హామీ ఆయనను నవ్వుల పాలు చేసింది. ఆయనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. చీప్ లిక్కర్ సంగతి తర్వాత ముందుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంగా తగ్గించాల్సిన రేట్ల గురించి చూడాలని సలహాలిస్తున్నారు. చివరికి అధికార పార్టీగా ఉండి.. మద్యం విక్రయాలను విపరీతంగా ప్రోత్సహిస్తోందని విమర్శలు ఎదుర్కొంటున్న తెలంగాణ సర్కార్‌కు చెందిన కీలక మంత్రి కేటీఆర్ కూడా ఏ మాత్రం తడుముకోకుండా ” వాట్ ఏ షేమ్ ” అనేశారు.
అయితే బయట ఎవరు ఎన్ని ట్రోల్స్ అయినా చేసుకోవచ్చు .. సోము వీర్రాజును ఎవరు ఎంత చీప్‌గా అయినా చూడొచ్చు కానీ ఆయన లెక్కలు మాత్రం ఆయనకు ఉన్నాయి. ఒక్క సారి ఏపీలో ఉన్న పరిస్థితులు చూడండి. ఏ మద్యం దుకాణం దగ్గరకు వెళ్లినా మందు బాబుల ” ఆశీర్వాదాలు” ప్రభుత్వాలు ఓ రేంజ్లో వినిపిస్తూఉంటాయి. ఎందుకంటే మొదటగా రేట్లు.. ఆ తర్వాత బ్రాండ్లు. పిచ్చి మందుతో పిచ్చి వాళ్లను చేయడమే కాక ఇల్లు కూడా గుల్ల చేస్తున్నారన్న అసంతృప్తి వారికి ఉంది. ఓటు వేసేటప్పుడు వారి ఆగ్రహాన్ని తమకు అవకాశంగా మల్చుకోవాలని సోము వీర్రాజు డిసైడయ్యారు.
ఆయన ఆషామాషీగా ఈ వ్యాఖ్యలు చేయలేదు. ఎంత మంది మందుబాబులు ఉన్నారో కూడా లెక్క చెప్పారు. కోటి మంది మందు బాబులు ఉన్నారని.. వారంతా ఓటు వేయాలని కోరారు. అంటే ఓ స్టడీ చేసి.. ఏపీలో మందు బాబులు తీవ్ర కష్టాల్లో ఉన్నారని.. వారి కష్టాలను తీర్చే ఒక్క హామీ ఇస్తే చాలు కోటి ఓట్లు వచ్చి పడతాయని డిసైడయ్యారు. ఆ మేరకు ముందుకెళ్లారు. ఎవరేమనుకున్నా సరే ఆయన సమర్థించుకుటున్నారు. ఈ దూకుడు తో హామీని మేనిఫెస్టో వరకూ తీసుకెళ్తే.. మందు బాబులు బీజేపీపై కరుణించిన కరుణించవచ్చని ఇప్పటికే బీజేపీలోని సోము వీర్రాజు వర్గం లెక్కలేయడం ప్రారంభించేసింది.