పోలవరం ప్రాజెక్టు… దాన్ని పూర్తి చేసే బాధ్యత తమది అంటూ భాజపా నేతలు ఈ మధ్య వాగ్దానాలు మీద వాగ్దానాలు చేశారు. ప్రాజెక్టు పనులు ఈ మాత్రమైనా ముందుకు సాగాయంటే అది తమ ఘనతే అంటున్నారు. సరే, నిన్నటికి నిన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఏమన్నారూ… సాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందీ, దాన్ని అందుకోవడం ఎలాగో ఆంధ్రా సర్కారుకు తెలియడం లేదన్నారు. ఆంధ్రాకి ఇకపై నిధులు ఇచ్చేది లేదు అని కేంద్రం ప్రకటించలేదు కదా, అలాంటప్పుడు భాజపాతో చంద్రబాబు వైరం ఎందుకనీ, ఇదంతా రాజకీయ కుట్రలో భాగమంటూ మాట్లాడిన సంగతి తెలిసిందే. సరే… రాష్ట్రంపై అంత బాధ్యత ఉంటే, ఏపీ విషయంలో సాయానికి అంతగా సిద్ధంగా ఉంటే.. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుపై ఈ తరహా కొర్రీలు ఎందుకు పెడుతున్నట్టు..? రీఎంబర్స్ చేయాల్సిన నిధుల విషయంలో కూడా నియమ నిబంధనలు మార్చాల్సిన అవసరం ఉందంటూ కొత్త పాట ఎందుకు..?
పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 1098 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తాన్ని రాష్ట్రానికి తిరిగి చెల్లిస్తున్నట్టుగా గత నెలలోనే కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో ఈ నిధులు పోలవరం ప్రాజెక్టు అధారిటీ (పీపీఏ) ద్వారా రాష్ట్రానికి రావాల్సి ఉంది. అయితే, ఇప్పుడు కొత్తగా పెట్టిన మెలిక ఏంటంటే… నాబార్డు, పీపీఏ, జలవనరుల మంత్రిత్వ శాఖ చేసుకున్న ఒప్పందంలో కొన్ని మార్పులు అవసరమన్నారు. సరే, వాటిని కూడా పూర్తి చేసి ఈ నెల 4న కేంద్ర ఆర్థిక శాఖకు నివేదించారు. ప్రస్తుతం ఆ ఫైలు అక్కడే చతికిలపడి ఉంది! ఇక్కడి నుంచి ఈ ఫైలు జలవనరుల శాఖకు వెళ్లాలి, నాబార్డుకు నడవాలి! ఇదంతా అయ్యేసరికి మరో రెండువారాలు పట్టేట్టు ఉందని తెలుస్తోంది.
ప్రాజెక్టుకు కొత్తగా నిధులు విడుదల చేయాలనుకున్నప్పుడు నియమ నిబంధనలు మార్చినా సరే ఓకే అనుకోవచ్చు. కానీ, సొమ్మును తిరిగి చెల్లిస్తామని ఒకసారి చెప్పిన తరువాత, మళ్లీ ఇప్పుడు ఎమ్.ఒ.యు.ల్లో మార్పులు చేర్పులంటే ఏమనుకోవాలి..? ఇది చాలదన్నట్టు మొత్తంగా ప్రాజెక్టు తుది అంచనాలపై కూడా కేంద్రం మరికొన్ని కొర్రీలు వేస్తోంది. ఇదేనా.. ఆంధ్రాకి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్న కేంద్రం వైఖరి..? ఇదేనా, ఏపీ అభివృద్ధికి కంకణం కట్టుకుట్టుకున్న భాజపా బాధ్యత..? గడచిన రెండ్రోజులుగా ఏపీ భాజపా నేతలు కేంద్ర సాయం గురించి మళ్లీ ఊదరగొడుతున్నారు. ఇక, కొత్తగా ఏపీకి వలస వచ్చిన జీవీఎల్ నర్సింహారావు అయితే కేంద్రం ఎంత చేస్తున్నా ఏపీ సర్కారుకి సంతృప్తి ఉండటం లేదంటారు. మరి, పోలవరం ప్రాజెక్టుపై, అదీ ఒక జాతీయ ప్రాజెక్టుపై ఇన్ని ట్విస్టులు ఎందుకు పెడుతున్నారో వీళ్లలో ఒకరైనా సమాధానం చెప్తారా..?