తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరును ఆ పార్టీ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కంబంపాటి హరిబాబు పదవీకాలం త్వరలో ముగియబోతోంది. ఆయన కూడా ఈ పదవికి మళ్ళీ పోటీ పడుతున్నారు కానీ ఆయన మిత్రపక్షమయిన తెదేపా పట్ల మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారని రాష్ట్ర నేతలు అభిప్రాయపడుతున్నారు. తెదేపా నేతలు అడపాదడపా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ ఆయన వాటిని గట్టిగా ఖండించే ప్రయత్నం చేయకపోవడంతో రాష్ట్ర ప్రజలలో కేంద్రప్రభుత్వంపై చాలా అపోహలు ఏర్పడ్డాయని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
మొన్న మార్చి 6న రాజమండ్రిలో భాజపా నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవాలసి ఉందని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నొక్కి చెప్పారు. కానీ రాష్ట్రంలో పార్టీ బలపడకుండా తెదేపా అడ్డుకొంటోందని ఆ పార్టీ నేత ఒకరు ఇటీవల బహిరంగంగానే చెప్పారు. కనుక తెదేపాను తట్టుకొని దానికి ప్రత్యామ్నాయ శక్తిగా రాష్ట్రంలో పార్టీని తీర్చిదిద్దాలంటే అందుకు తగిన వ్యక్తి సోము వీర్రాజేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీలో కొంచెం గట్టిగా మాట్లాడే వారిలో పురందేశ్వరి కూడా ఉన్నపటికీ ఆమె జాతీయ మహిళా మోర్చా అధ్యక్ష పదవికి ప్రయత్నిస్తునందున, సోము వీర్రాజు పేరును పార్టీ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కన్నా లక్ష్మినారాయణ తదితరులు కూడా ఈ పదవి కోసం ఆశ పడుతున్నపటికీ, పార్టీకి చిరకాలంగా సేవలు చేస్తున్న సోము వీర్రాజుకే బాజపా అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ సోము వీర్రాజు రాష్ట్ర బాజపా అధ్యక్షుడిగా నియమించబడినట్లయితే, ఇక తెదేపా-బాజపాలు తెగతెంపుల ప్రక్రియ ప్రారంభం అయినట్లే భావించవచ్చును. అది ఎంతకాలంలో ఆయన పూర్తి చేస్తారనేదే ప్రశ్న.