అవసరానికి బీజేపీని, మోదీని ఉపయోగించుకోవడానికి మోహన్ బాబు ఫ్యామిలీ ఏ మాత్రం వెనుకాడదు. ఓ సారి కోర్టు వాయిదాలకు హాజరై కోర్టు ఎదుట తాను మోదీ, బీజేపీ మనిషినని అసందర్భంగా ప్రకటించుకున్నారు. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారని అప్పటికే చాలా మందికి అర్థం అయింది. ఆ తర్వాత పలు ఇంటర్యూల్లో మోదీకి తమ ఫ్యామిలీ ఎంతో దగ్గరని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇవ్వాలంటే మాత్రం… ఆయన తెగ ఆలోచిస్తున్నారు. ఏ విషయం చెప్పడం లేదు.
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మూడు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సినీ నటుడు మోహన్ బాబును కోరారు. ఆయన ఇవాళ తరుపతిలో ఉన్న మోహన్ బాబు నివాసంలో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించాలని కోరారు. అయితే ఈ అంశంపై మోహన్ బాబు అంగీకరించారో లేదో స్పష్టత లేదు. ఏ విషయం చెప్పకుండానే పంపేశారు. దాంతో సోము వీర్రాజు నిరాశకు గురయ్యారు.
మోహన్ బాబు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గత ఎన్నికలకు ముందు ఆయన వైఎస్ఆర్సీపీలో చేరారు. వైసీపీ కోసం పని చేసిన ఇతర సినీ నటులకు కూడా పదవులు లభించాయి కానీ మోహన్ బాబుకు మాత్రం ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో ఆయన పార్టీపై అసంతృప్తితో దూరం జరిగారని భావిస్తున్నారు. అయితే బీజేపీలో చేరుతాను కానీ ఇక ఏ పార్టీ తరపున పని చేసేది లేదని కొన్ని ఇంటర్యూల్లో చెప్పారు. ఇప్పుడు నేరుగా బీజేపీకి మద్దతు ఇవ్వమంటే మాత్రం ఆలోచిస్తున్నారు.
తమ అవసరాల కోసం మోదీ, బీజేపీ పేరును ఉపయోగించుకుని..అవసరమైన సందర్భంలో బీజేపీకి మద్దతివ్వంటే మాత్రం ఇలా సైలెంట్ గా ఉంటున్నారని బీజేపీ వర్గాలు గుర్రుమంటున్నాయి.