ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా కొత్తగా నియమితులైన సోము వీర్రాజు మొదటగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. సాధారణంగా ఆయన…మొదట పవన్ కల్యాణ్‌ని కలుస్తారని భావించారు. అయితే.. పవన్ కల్యాణ్‌తో భేటీ కంటే ముందు..చిరంజీవితో సమావేశమయ్యారు. వీరి మధ్య తాజా రాజకీయాలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిని అయినందున చిరంజీవిని మర్యాదపూర్వకంగానే కలిసినట్లుగా సోము వీర్రాజు వర్గీయులు చెబుతున్నారు. చిరంజీవి అభినందించారని చెబుతున్నారు. అయితే రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి సోము వీర్రాజు ప్రత్యేకంగా ఎందుకు కలవాల్సి వచ్చిందనే దానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.
కొంత కాలం క్రితం .. చిరంజీవిని బీజేపీలోకి ఆహ్వానించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. ఆయనకు రాజ్యసభ సీటు ఖరారు చేశారని చెప్పుకున్నారు. అయితే.. చిరంజీవి మాత్రం..సైలెంట్ గా ఉండిపోయారు. తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి వదిలేశానని నేరుగానే ప్రకటించారు. పాలిటిక్స్ బ్యాటన్ ను తన సోదరుడు పవన్ కు అప్పగించేశారు. ఇదే విషయాన్ని తన అభిమానులందర్నీ గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేర్పించడం ద్వారా చేతలతోనే చెప్పారు. పవన్ కల్యాణ్ కూడా ఇంగ్లిష్ మీడియాకు ఇంటర్యూలు ఇచ్చి.. ప్రత్యక్ష రాజకీయాలకు చిరంజీవి దూరమని చెప్పేశారు.
అయితే రాజకీయాల్లో ఎప్పుడు..ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అంచనా వేయడం కష్టం. భారతీయ జనతా పార్టీ వ్యూహం భిన్నంగా ఉంటుంది. ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న నేతల్ని చేర్చుకుని మెల్లగా తమ వ్యూహంతో వారిని నేతలుగా నిలబెడుతూ ఉంటారు. ఇంకా ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి… సోము వీర్రాజు ద్వారా మొదటి అడుగు వేశారని అనుకోవచ్చంటున్నారు. అయితే.. తమ్ముడు పవన్ తో కలిసి.. ప్రజా పోరాటాలు చేయాలని..చిరంజీవి సూచించినట్లుగా చెబుతున్నారు. సోము వీర్రాజు… ప్రభుత్వంపై పోరాటం కన్నా… ప్రతిపక్షంపై పోరాటానికే ఎక్కున సమయం కేటాయిస్తున్నారు.