” ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుని.. మెగాస్టార్ చిరంజీవి కలిశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు..” అనే ప్రకటన గురువారం సాయంత్రం.. మీడియా సంస్థలకు అందింది. బీజేపీ సోషల్ మీడియా విభాగాల్లోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ విస్తృతంగా సర్క్యూలేట్ అయింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. చిరంజీవి మరీ అంతగా… దిగిపోయారా.. లేక.. సోము వీర్రాజు ఎదిగిపోయారా.. అని ఆలోచనలు ప్రారంభించారు. బీజేపీ నుంచి సమాచారం ఆధారంగా.. మీడియా చానళ్లు కూడా… సోము వీర్రాజుతో చిరంజీవి భేటీ అని ప్రచారం చేసేశాయి. దీంతో మెగాభిమానులు కూడా బాధపడ్డారు. కానీ కాసేపటికే అసలు విషయం బయటకు వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి.. సోము వీర్రాజును కలవలేదు. సోము వీర్రాజునే చిరంజీవి ఇంటికి వచ్చారు. అపాయింట్మెంట్ అడిగి మరీ.. కలుస్తానని చెప్పి వచ్చారు. కలిశారు. కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా.. తనను కలవాలని అడిగితే… వద్దు అని చెప్పలేని మొహమాట పరిస్థితుల్లో చిరంజీవి రమ్మన్నారు. అయితే.. దీన్నే ఆసరాగా చేసుకున్న సోము వీర్రాజు.. చిరంజీవి ఇమేజ్ను డ్యామేజ్ చేసి.. తన ఇమేజ్ పెంచుకునేందుకు ప్రయత్నం చేశారు . మీడియాకు ఇచ్చిన తప్పుడు సమాచారంలోనే.. జనసేన, బీజేపీ వచ్చేఎన్నికల్లో అధికారంలోకి రావాలని ఆకాంక్షించినట్లుగా చెప్పుకున్నారు. తర్వాత డిలీట్ చేశారు.
సోము వీర్రాజు కలిసి వెళ్లిన తర్వాత సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం చూసి.. మెగా క్యాంప్ షాక్కు గురైంది. వెంటనే… ఆ ప్రచారం ఆపకపోతే.. జరిగిందేమిటో.. మీడియాకు చెబుతామని హెచ్చరికలు రావడంతో.. బీజేపీ సోషల్ మీడియా విభాగం.. ట్వీట్లు డిలీట్ చేయడం… సోము వీర్రాజునే వెళ్లి చిరంజీవి కలిశారని చెప్పడం.. లాంటి దిద్దుబాట్లకు దిగింది. మరోసారి సోము వీర్రాజు అపాయింట్మెంట్ అడిగితే.. ఒకటికి పది సార్లు ఆలోచించుకునే పరిస్థితిని చిరంజీవికి… కల్పించారు బీజేపీ నేతలు.