భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి టీడీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. కేంద్రం ఆంధ్రాకి చేయాల్సినదాని కంటే ఎక్కువే చేసిందన్నారు. తమకు ఈ రాష్ట్రంలో పెద్దగా ఆదరణ లేకపోయినా చాలా చేశామంటూ ఆ జాబితాను విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్ లో వివరించారు. రాష్ట్రం విడిపోవడానికి అనుకూలంగా చంద్రబాబు అప్పట్లో ఇచ్చిన లేఖను చూపుతూ… తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుకూలంగా విభజనకు ఓకే అని ఒప్పుకున్నారనీ, కానీ ఆంధ్రా ప్రయోజనాల సంగతేంటి అనే అంశమే దాన్లో లేదని ఆరోపించారు. విడిపోయాక మిగిలే 13 జిల్లాల ప్రయోజనాల గురించి ఆలోచించింది భాజపా మాత్రమే అన్నారు. పార్లమెంటులో ప్రత్యేక హోదా అంశాన్ని వెంకయ్య లేవనెత్తారనీ, ఐదేళ్లు చాలదు, 15 ఏళ్లు కావాలని ముందు ఆయన డిమాండ్ చేసిన తరువాతే టీడీపీ మాట్లాడిందని చెప్పారు. దీనిపై పార్లమెంటులో చర్చ జరుగుతున్నప్పుడు సుజనా చౌదరి, సీఎం రమేష్ లు నోటికి గుడ్డలు కట్టుకున్నారే తప్ప మాట్లాడలేదన్నారు.
ఇక, పోలవరం గురించి వీర్రాజు మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు నిర్మాణం వెనక భాజపా క్రుషి చాలా ఉందన్నారు. అప్పట్లో కిషన్ రెడ్డిని రాజమండ్రి తీసుకొచ్చి, ఆంధ్రాకు ఈ ప్రాజెక్టు ఎంత అవసరమో నచ్చజెప్పింది తామే అన్నారు. అంతేకాదు, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకుండా తాము చాలా చేశామన్నారు. ఈ రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా ప్రజల ప్రయోజనాల కోసం పాటుపడ్డామన్నారు. విభజన హామీలను 2022 వరకూ పూర్తి చేసే అవకాశం ఉందన్నారు. కానీ, 2019కే పోలవరం పూర్తి చేయాలన్న తొందర టీడీపీ వల్లనే పెరుగుతోందన్నారు. అమరావతి శంకుస్థాపన సమయంలో ప్రధానమంత్రి వచ్చి లక్ష కోట్లు ప్రకటిస్తారని ప్రచారం చేసి, పద్ధతి ప్రకారం బద్నామ్ చేసింది టీడీపీ అని ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో నాడు ఒప్పుకుని, ఇప్పుడు మళ్లీ ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో పనులు ప్రారంభించబోతున్న కియా సంస్థ కూడా మేక్ ఇన్ ఇండియ కార్యక్రమంలో భాగంగా ప్రధాని చొరవతో వచ్చిందని చెప్పుకొచ్చారు.
వీర్రాజుగారు మళ్లీ ఆవేశపడిపోతున్నారు. కేంద్రం ఏదీ చేయలన్నది కాదు కదా ఇప్పుడు చర్చ! చేస్తామన్నవి చేయలేదన్నదే పాయింట్. రోడ్లేశాం, పోలవరం నిధులిస్తున్నాం, పరిశ్రమలు తెచ్చాం… ఏపీలో ఎమ్మెల్యేలు లేకపోయినా మాట్లాడాం అంటే ఎలా..? ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం బాధ్యతలు కాదా..? భాజపా ప్రాతినిధ్యం లేని రాష్ట్రాల్లో కూడా కేంద్ర పథకాలు, నిధుల కేటాయింపులు ఉంటాయి. అవి కూడా భాజపా వితరణగానో, వారి పెద్ద మనసుగానో చెప్పుకుంటారా..? విభజన నేపథ్యంలో అన్నీ కోల్పోతున్న తరుణంలో ప్రత్యేకంగా ఆదుకుంటామని చెప్పిందేదీ వారే కదా. ఆ ప్రత్యేక సాయమే ఏదీ అనేదే ఇప్పుడు ప్రశ్న. ఆ పాయింట్ వదిలేసి.. టీడీపీ తమను విమర్శిస్తోంది కాబట్టి, మనమూ కౌంటర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో వీర్రాజు స్పందించినట్టు కనిపిస్తోంది.