అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తాం అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అనవసరంగా ప్రకటనలు చేస్తున్నారు. పార్టీకి అనవసరమే కానీ.. ఆయన రాజకీయానికి అవసరమే అన్నట్లుగా ఎక్కడా తగ్గడంలేదు. పొత్తుల విషయం మాట్లాడవద్దని హైకమాండ్ చాలా సార్లు చెప్పినప్పటికి ఆయన మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఎక్కడికి వెళ్లినా టీడీపీతో పొత్తు ఉండదని చెప్పడానికి చాలా తాపత్రయ పడుతున్నారు. ఈ విషయంలో ఒక్కో సారి అతి ఉత్సాహానికి పోయి ఒంటరిపోటీకి కూడా సిద్ధమేనని చెబుతున్నారు. ఇది బీజేపీ వర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. జనసేన పార్టీని కూడా దూరం చేసే వ్యూహాన్ని సోము వీర్రాజు అమలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం బీజేపీ – జనసేన పొత్తులో ఉన్నా కేవలం సోము వీర్రాజు వ్యవహారశైలి వల్లనే ఆ రెండు పార్టీలు కలసి పని చేయలేకపోతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆయన జనసేన పార్టీని కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేయకపోగా అవమానిస్తున్నారని అంటున్నారు. ఇక ఓట్ల చీలిక లేకుండా చూస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించిన అంశంపైనా సోము వీర్రాజు ప్రకటన జనసేన పార్టీని అనుమానించేలా ఉంది. ఆ పార్టీ తమను వదిలేసి టీడీపీతో పొత్తు పెట్టుకుందన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. తన రాజకీయ తెలివి తేటలన్నీ ఉపయోగిస్తున్నారు.
ఏపీ బీజేపీ నేతల వ్యవహారశైలి ముఖ్యంగా సోము వీర్రాజు వంటి వారికి.. తమ పార్టీకి ఒక్క శాతం ఓట్లు వచ్చినా సరే ఒంటరిగా పోటీ చేయాలని లేదా జనసేనతో కలిసి పోటీ చేయాలని.. ఇంకెవరికో లాభం చేయాలనే లక్ష్యంతో ఉన్నారని స్పష్టంగా తెలిసిపోతోంది. ఆయన తీరును ఏపీ బీజేపీలోని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయినప్పటికీ సోము వీర్రాజు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.