బీజేపీ, పవన్ కల్యాణ్ తనకు అండగా ఉండకపోవచ్చునని జగన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకూ బీజేపీ తో కలిసి ఉన్ననట్లుగా ఇప్పటి వరకూ బీజేపీ సహకరించినట్లుగా.. ఇక ముందు సహకరించదన్నట్లుగా జగన్ ముద్ర వేయడంపై సోము వీర్రాజు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. జగన్ ను బీజేపీ ఏనాడూ సమర్థించలేదని, ఆయనకు అండగా లేదని చెప్పారు. వైసీపీతో బీజేపీ ఎప్పుడుందో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు.బీజేపీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సపోర్ట్ చేయడని జగన్ ఎలా చెపుతారని వీర్రాజు మండిపడ్డారు. పవన్ కల్యాణ్ బీజేపీతోనే ఉన్నారని చెప్పారు.
జగన్ అనుసరిస్తున్న విధానాలను ర్యాలీలు, సభలు, ఆందోళనల ద్వారా ప్రజలకు వివరించామని తెలిపారు. మతతత్వ వైఖరితో బీజేపీ లేదని… ఆ వైఖరితో వైసీపీ ఉందని అన్నారు. బీజేపీ గురించి మాట్లాడే హక్కు కూడా జగన్ కు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ గురించి వైసీపీ నేతలు ఎప్పుడూ మాట్లాడరని… వారి పార్టీని విమర్శించినప్పుడే వారికి ఇవి గుర్తొస్తాయని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వంలో అంతులేని అవినీతి జరుగుతోందని…. ఏపీ అవినీతి మంత్రులపై బీజేపీ పోరాడుతుందని వీర్రాజు చెప్పుకొచ్చారు.
సోమ వీర్రాజు ఆవేశమే కానీ.. కన్నా లక్ష్మినారాయణ ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంపై ఓ రేంజ్ లో పోరాడారు. కరోనా సమయంలో ప్రభుత్వ అవినీతిని బయట పెట్టడంతో విజయసాయిరెడ్డి .. కన్నాను తీసేస్తారని ప్రకటించి మరీ తీసేయించారని చెబుతారు. కన్నాను తప్పించి సోము వీర్రాజుకు చాన్సిచ్చారు. అప్పట్నుంచి వైసీపీ అనుబంధ పార్టీగా బీజేపీ మారిపోయింది. జగన్ ఏం చేసినా సమర్థిస్తూ వచ్చారు. ఇప్పుడు మాత్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తున్నారు. కానీ.. తాము ఎప్పుడూ పోరాడుతున్నామని చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.