ఏపీలో బీజేపీ జగన్ వెంటే ఉందని నిరూపించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా చేస్తున్న విమర్శలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. అయితే ఇది విచిత్రంగా .. వైసీపీని సపోర్ట్ చేస్తున్నట్లుగా ఉండటంతో ఇతర ఏపీ బీజేపీ నేతలు తల పట్టుకోవాల్సి వచ్చింది. జగన్ పై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు, అచ్చెన్నాయుడు చేస్తున్న డిమాండ్లపై సోము వీర్రాజు .. వైసీపీని వెనకేసుకు వచ్చినట్లుగా భావించారు. రాష్ట్రాల్లో శాంతిభద్రతలతో కేంద్రానికి సంబంధం లేదని… ధైర్యంగా ఎదుర్కోవాలని హితవు పలికారు.
తమ పార్టీ నేతలపై బెంగాల్, కేరళల్లో దాడులు జరుగుతున్నాయని తాము ధైర్యంగా ఎదుర్కొంటున్నామని చెప్పుకొచ్చారు. ఆయన మాటలు విన్న వారంతా… ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితులపై కనీస జాగ్రత్తలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉండదని.. హద్దులు దాటిపోతున్న అధికార దుర్వినియోగాన్ని ఆపడానికి కేంద్రం ముందుకు రాదని చెబుతున్నారు. కానీ బెంగాల్ లో కేంద్రం తరపున చేపడుతున్న చర్యలు మాత్రం కళ్ల ముందు కనిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల కోసం కేంద్ర బలగాలను పంపారు.ఏపీలో బీజేపీ నేతల తలలు పగులగొట్టినా… నామినేషన్లు వేయనివ్వకపోయినా ఏపీ చేయలేకపోయారు. ధైర్యంగా ఎదుర్కోవాలని సోము వీర్రాజు కథలు చెబుతున్నారు.
బీజేపీతో వద్దని.. ఆ పార్టీ వైసీపీకి సహకరిస్తోందన్న ముద్ర బలంగా వేయాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. వారిద్దరూ ఒకటేనని చెప్పాలని అనుకుంటోంది. ఈ వాదన నిజమేనని నిరూపించడానికి సోము వీర్రాజు తన వంతు సాయం చేస్తున్నారు. ఆయన కు మొదటి నుంచి వైసీపీపై అభిమానం ఉండవచ్చు కానీ.. ఇలా బయట పెట్టుకుంటే పార్టీకి నష్టమనే సంగతిని మర్చిపోతున్నారు.