బద్వేలు తరహాలో మరోసారి ఉపఎన్నికల్లో పోటీ చేసి కానిసి ఓట్లు సాధించి బీజేపీ ఉనికి ఉందని నిరూపించాలని సోము వీర్రాజు డిసైడయ్యారు. మేకపాటి గౌతంరెడ్డి చనిపోవడంతో అక్కడ ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని ప్రకటించేసారు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. నెల్లూరు జిల్లా పర్యటనలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 తర్వాత ఏపీలో రెండు ఉప ఎన్నికలు జరిగాయని, తిరుపతి, బద్వేలులో బీజేపీ పోటీ చేసిందని, ఆత్మకూరులో కూడా కచ్చితంగా పోటీ చేస్తుందని తెలిపారు.
అభ్యర్థి ఎవరనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖరారు చేసుకుంటామన్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో చనిపోయిన ఎంపీ బల్లిదుర్గా ప్రసాదరావు కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో అన్ని రాజకీయ పార్టీలు పోటీ చేశాయి. కానీ బద్వేలులో మాత్రం చనిపోయిన ఎమ్మెల్యే భార్యకే అవకాశం కల్పించడంతో అన్ని రాజకీయ పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. కానీ బీజేపీ మాత్రం పోటీ చేసింది. ఇరవై వేల ఓట్ల వరకూ సాధించింది.
ఎవరూ పోటీ చేయని ఎన్నికలో ఇరవై వేల ఓట్లు సాధించి తాము మెరుగుపడ్డామని ప్రచారంచేసుకున్నారు. ఇప్పుడు ఆత్మకూరులోనే అదే పద్దతి పాటించాలని అనుకుంటున్నారు. గౌతంరెడ్డి కుటుంబీకులే అక్కడ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో అక్కడి రాజకీయ పరిస్థితులను బట్టి చూసినా… విపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయడం కష్టమే. ఈ పరిస్థితిని మరోసారి ఓట్లుగా మల్చుకోవాలని సోము వీర్రాజు డిసైడయ్యారు.