కేంద్రం తరఫున మరోసారి వకాల్తా పుచ్చేసుకుంటున్నారు ఏపీ భాజపా నాయకులు! రాష్ట్రంలో ప్రత్యేక హోదా వేడి మరోసారి రగులుకున్న సంగతి తెలిసిందే. ఇంకోపక్క, తెలుగుదేశం సర్కారు కూడా ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచుతోంది. ఏపీలో ప్రతిపక్షాలన్నీ హోదా పేరుతో భాజపాని కార్నర్ చేస్తుంటే.. మిత్ర పక్షం టీడీపీ కూడా చట్టబద్ధత పేరుతో ఒత్తిడి తెస్తోంది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌పై తమ పార్టీకి ఉన్న బాధ్యతను గుర్తు చేస్తున్నారు…. భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు.
ప్యాకేజ్‌కు చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్రం పటిష్ఠమైన చర్యలు తీసుకుంటోందని సోము వీర్రాజు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రం విడిపోతే ఆంధ్రాలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని చెప్పిన పార్టీ తమదే అన్నారు. కాబట్టి, ఏపీకి ఏమాత్రం అన్యాయం జరిగే ప్రసక్తే లేదన్నారు. విడిపోతే గుజరాత్ కంటే త్వరగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం భాజపాకి ఉందనీ, ఆ బాధ్యత తమదని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. సెంటిమెంట్స్ పేరుతో లేనిపోని రాజకీయాలు చేయొద్దని తాను విన్నవిస్తున్నట్టు ఆయన చెప్పారు.
సెంటిమెంట్స్ పేరు వద్దని చెబుతూనే గుజరాత్‌తో ఆంధ్రాకి అలాంటి లింకే పెట్టేశారు! మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ కాబట్టి… అదే స్థాయిలో ఆంధ్రా అభివృద్ధి ఉంటుందని చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటీ..? ఆంధ్రా విషయంలో మోడీ నిర్లక్ష్యంగా ఉంటున్నారన్న విమర్శ వినిపిస్తోంది కదా! దాన్ని ఇలా తిప్పికొడుతున్నారు. మోడీకి ఏపీ కూడా సొంత రాష్ట్రంతో సమానమే అనే స్థాయి నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
నిజానికి, ఏపీపై సొంత రాష్ట్రం అనే ఫీలింగ్ ప్రధానికి ఉండాల్సిన అవసరం లేదు! ఎన్నికల ముందు భాజపా ఇచ్చిన మాట నిలబెట్టుకోమనండీ, అదే చాలు! హోదా విషయంలో ఒక మెట్టు దిగి ప్రకటించమనండీ, అదే చాలు! ఏపీలో ఏం చేసినా ఆ క్రెడిట్ భాజపాకి దక్కకుండా పోతోందన్న అభిప్రాయం నుంచి బయటకి రమ్మనండి, అది చాలు! అన్నిరకాలుగా నిర్లక్ష్యానికి గురౌతున్న రాష్ట్రంగానే ఆంధ్రాని చూడమనండీ, అది చాలు! వీర్రాజు లాంటి భాజపా నేతలు… ఈ కేంద్రం భజన ఆపితే, అదే చాలు! సొంత రాష్ట్రం కోసం అధికార పక్ష నాయకులుగా మనం చేసిందేంటీ, సాధించిందేంటీ, పోరాడింది ఏంటీ… అనే ప్రశ్నలు వేసుకోండీ, అదొక్కటే చాలు!