ఏపీలో బలపడటం కోసం భాజపా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కర్ణాటక ఎన్నికలు అయిపోగానే ఆంధ్రాపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని భాజపా నేతలు చాలాసార్లు చెప్పారు. సరే, కర్ణాటక ఫలితాలు ఊరించీ ఊరించీ కుర్చీ చేజార్చుకోవాల్సిన పరిస్థితి భాజపాకి ఎదురైంది. ఇప్పుడు, ఆంధ్రా విషయానికొస్తే… భాజపాకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడు వచ్చారు. అప్పటి నుంచీ టీడీపీపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసే విమర్శల విధానం కాస్త మారింది. ఇదే విధానాన్ని అనుసరించాలని జాతీయ నాయకత్వం నిర్దేశించిందేమో తెలీదు! దీన్నే అనుసరిస్తే తమకంటూ కొంత స్పేస్ ఆంధ్రాలో వస్తుందని భావిస్తున్నారేమో..! ఇంతకీ ఆ విమర్శల విధానం ఏంటంటే… ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో కాంగ్రెస్ మనిషే అని ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం.
సోము వీర్రాజు తాజాగా మరోసారి చంద్రబాబుపై విమర్శలు చేశారు. ధర్మ పోరాట దీక్షలతో ప్రజా ధనాన్ని సీఎం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. సాధారణ పరిపాలన గాలికి వదిలేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే ఆయనకి సరైన శిక్ష వేస్తారన్నారు. ముఖ్యమంత్రి వైఖరి చూస్తుంటే గొంగట్లో ఉంటూ ఏదో ఏరుకునేట్టుగా కనిపిస్తోందన్నారు. ‘నువ్వు కాంగ్రెస్ లో ఉండి, కాంగ్రెస్ మనిషిగా.. తెలుగుదేశం ముసుగు కప్పుకున్న వ్యక్తివి నువ్వు. కాంగ్రెస్ రక్తం నరనరాన జీర్ణించుకునే వ్యక్తి ఇవాళ్ల ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం’ అన్నారు. రోజూ కథలు చెబుతూ దీక్షలతో కాలయాపన చేస్తుండే ఒక ప్రత్యకమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ్ల నెలకొందన్నారు.
సో.. సోము వీర్రాజు మిషన్ అర్థమైంది కదా! టీడీపీ, కాంగ్రెస్ లను ఒకే గాటన కట్టి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రొజెక్షన్ ద్వారా తమకు లబ్ధి చేకూరుతుందన్నది వారి వ్యూహంగా ఉంది. కానీ, సోము వీర్రాజు మిస్సవుతున్న లాజిక్ ఏంటంటే… చంద్రబాబుకు నరనరాన కాంగ్రెస్ రక్తం ఉందనుకుంటే, కొన్ని దశాబ్దాలుగా భాజపా ఎందుకు స్నేహం చేస్తూ వచ్చింది..? టీడీపీ తనకుతానుగా తెంచుకుంటేనే కదా ఎన్డీయే బంధం తెగింది..? అయ్యో… చంద్రబాబు బ్లడ్ గ్రూప్ కాంగ్రెస్ దేనని గుర్తించి, అపచారం జరిగిపోయిందని భాజపా తప్పుకోలేదే..? పొత్తు ఉన్నంత కాలం చంద్రబాబులో ఈ కోణం భాజపాకి కనిపించలేదా..? ఈ ప్రశ్నలకు కూడా సోము వీర్రాజు దగ్గర సమాధానం ఉంటే, దాన్ని వినిపిస్తే మరింత బాగుంటుంది. ఈ మధ్య ఆయన పనిగట్టుకుని మరీ వినిపిస్తున్న వాదనకు బలం చేకూరుతుంది కదా!