రాజకీయ దినచర్యలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మరోసారి విమర్శలూ ఆరోపణలూ చేశారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు..! రోజూ కొత్త కంటెంట్ అంటూ ఏముంటుంది..? చంద్రబాబు పాలనలో రోజుకో చోట అవినీతి వారికి కనిపిస్తూ ఉంటుంది. కానీ, వారు చూస్తున్న అవినీతిని ప్రజలకు మాత్రం చూపించలేకపోతున్నారు. తాజాగా విజయవాడలో వీర్రాజు మాట్లాడుతూ… అవినీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆస్కార్ అవార్డు కూడా సరిపోదని ఎద్దేవా చేశారు. ప్రతీ ప్రాజెక్టులోనూ తీవ్రమైన అవినీతి చేస్తూ, ఉపాధి హామీగా మార్చేస్తున్నారన్నారు! అధర్మ ప్రభువు ధర్మపోరాటాలు చేస్తున్నట్టుగా చంద్రబాబు పోరాటాలు ఉంటున్నాయంటూ ఎద్దేవా చేశారు.
కడప ఉక్కు కర్మాగారం సాధన దీక్షపై మాజీ రాష్ట్రమంత్రి మాణిక్యాలరావు విమర్శలు చేశారు. ఉక్కు కర్మాగారం రాకపోవడానికి కారణం తెలుగుదేశం పార్టీయే అని ఆయన ఆరోపించారు. సీఎం రమేష్ చేస్తున్నది దొంగ దీక్ష అనీ, ఆమరణ దీక్ష అంటూ ఆయన చేస్తున్న హడావుడి ఒక నాటకమన్నారు. ఏపీ హామీలపై కేంద్రం సానుకూలంగా ఉందనీ, రైల్వే జోన్ పై కూడా ఆలోచిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, ఇతర భాజపా నేతలు కూడా సీఎం రమేష్ చేస్తున్న దీక్షపై అటుఇటుగా ఇలానే స్పందించినవారే.
స్థూలంగా చూస్తే భాజపా నేతలంతా వినిపిస్తున్న వాదన ఏంటంటే… కేంద్రం ఏపీకి ఇవ్వాల్సిన అంశాలపై టీడీపీ చేస్తున్న పోరాటాలు బూటకాలనీ, నాటకాలనే కదా! మరి, ఇదే వాదనను… వైకాపా విషయంలో కూడా భాజపా నేతలు వినిపిస్తారా అనేదే ప్రశ్న..? అంటే, వైకాపా కూడా ప్రత్యేక హోదా లాంటి అంశాలతోపాటు, కేంద్ర హామీలపై కూడా పోరాటం చేస్తోంది కదా. చంద్రబాబు సాధించలేకపోయారని రూటు మార్చి చెబుతున్నా… వారు లేవనెత్తుతున్న అంశాలు కూడా ఏపీకి కేంద్రం ఇవ్వాల్సినవే కదా. భాజపా పాయింటాఫ్ వ్యూ నుంచి చూసుకుంటే.. చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షలు అధర్మ పోరాటాలు అయినప్పుడు, సీఎం రమేష్ చేస్తున్న దీక్ష దొంగ దీక్ష అయినప్పుడు… అవే కేంద్ర హామీలపై వైకాపా నేతలు చేస్తున్న పోరాటాలను కూడా ఇలానే భాజపా నేతలు చూడాలి కదా..? ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా వైకాపా ఎంపీలు చేసిన త్యాగాలను ఇదే తరహాలో నాటకాలనీ బూటకాలనీ భాజపా నేతలు తప్పుబట్టగలరా..? ఎందుకంటే, ఒకే అంశంపై ఏపీలో అధికార పార్టీ చేస్తున్న పోరాటాలను తప్పుగా వారు పరిగణిస్తున్నప్పుడు, ఇదే రాష్ట్రానికి చెందిన ప్రతిపక్షం చేస్తున్న పోరాటాన్నీ అలానే చూడాలి కదా!
టీడీపీ, వైకాపాల విషయంలో ఇలాంటి సమదృష్టి భాజపాకి ఉందా లేదా అనే దాని గురించి మాట్లాడుకోవడమంటే.. ముంజేతి కంకణాన్ని అద్దం చూసుకోవడం లాంటిదే..! టీడీపీ నేతలు దీక్షలు చేస్తుంటే భాజపా నేతలు తీవ్రంగా స్పందించేస్తూ… వైకాపా నేతల చర్యల విషయంలో మౌనంగా ఉంటూ పోతే.. ఆ తేడా ప్రజలకు అర్థం కాదని అనుకోకూడదు సుమా.