తిరుపతి ఉపఎన్నికల సమయంలో బీసీని సీఎం చేస్తామంటూ నినాదం ఇచ్చి పవన్ కల్యాణ్‌కు ఝులక్ ఇచ్చిన సోము వీర్రాజు ఇప్పుడు మరోసారి సీఎం అభ్యర్థి విషయంలో ఏకంగా పవన్ కల్యాణ్తోనే రాజకీయం ప్రారంభించారు. తమను వదిలేసి ఎక్కడ టీడీపీతో పొత్తు పెట్టుకుంటారో అనే కంగారు కన్నా… ఎక్కడ వైసీపికి నష్టం జరుగుతుందో అన్న ఆవేదనతో ఉన్న సోము వీర్రాజు.. కొత్త పాచిక విసిరాలు. తమ సీఎం అభ్యర్థి పవన్ కల్యాణ్ అనిచెబుతున్నారు. బీజేపీ – జనసేన సీఎం అభ్యర్థిపవన్ కల్యాణ్ అని.. ఆయనను సీఎంగా అంగీకరించి ఇతరపార్టీలు కూటమిలో వచ్చి చేరితో ఓకేఅంటున్నారు. లేకపోతే కూటమిలో చేర్చుకోబోమంటున్నారు.
అంటే టీడీపీ ఇక కూటమి వైపు రాదని ఆయన వ్యూహం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. పొత్తుల గురించి హైకమాండ్ చూసుకుంటుందని కన్నా లక్ష్మినారాయణ లాంటి నేతలు కూడా చెబుతున్నారు. కానీ సోము వీర్రాజు మాత్రం అదే పనిగా తాపత్రయ పడుతున్నారు. బీజేపీతో జనసేన వెళ్తుందని మీడియానే అనుకుంటోందని … తమ పొత్తు ఉంటుందని చెబుతున్నారు. టీడీపీతో పొత్తుపై అదే పనిగా స్పందిస్తున్నారు. ప్రో వైసీపీ నేతలకు సోము వీర్రాజు ఉత్సాహం సంతోషాన్నిస్తోంది కానీ… ఎంతో కొంత రాజకీయ అధికారం పొందాలనుకున్న వారికి మాత్రం ఇబ్బందికరంగా మారింది.
బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తే ఓట్లు చీలి వైసీపీకి లాభం కలుగుతుందని ఇప్పటికే లెక్కలు బయటకు వచ్చాయి. జనసేనను టీడీపీతో కలవనీయకుండా చేయాలని వైసీపీ టాస్క్‌గా పెట్టుకుంది. అదే టాస్క్‌ను సోము వీర్రాజు కూడా పెట్టుకున్నారు. అందుకే చిత్రవిచిత్రమైన ప్రతిపాదనలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే సోము తీరు నచ్చక… బీజేపీతో కలిసి నడిచేందుకు కలిసి కార్యకలాపాలు చేపట్టేందుకు జనసేన నేతలు దూరంగా ఉంటున్నారు. కడప సభకు ఆహ్వానించినా వెళ్లలేదు.