సోము వీర్రాజు మాటల్లో తేడా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఆయన టీడీపీ గురించి నెగెటివ్ కన్నా పాజిటివ్‌గా ఎక్కువ మాట్లాడుతున్నారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్డీఏను వీడకుండా బీజేపీతోనే ఉండి ఉంటే…. వైసీపీ అధికారంలోకి వచ్చేది కాదని కొత్తగా సెలవిచ్చారు. రాజధానిగా అమరావతికి తామే పెద్ద సపోర్టర్లమన్నట్లుగా తాజాగా పాదయాత్ర ప్రారభించారు. దానికి సోము వీర్రాజే నేతృత్వం వహిస్తున్నారు. వైసీపీ మూడు రాజధానుల కాన్సెప్ట్ పెట్టినప్పుడు మౌనంగా ఉండి.. రైతులు అలుపెరుగని పోరాటం చేసి న్యాయస్థానంలో అనుకూలమైన తీర్పు వచ్చాక బీజేపీ నేతలు రంగంలోకి దిగారు.
తాము మొదటి నుంచి అమరావతి మద్దతుగా ఉన్నామని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజంగా బీజేపీ అమరావతికి సపోర్ట్ అయితే్.. జగన్ సర్కార్ ధ్వంసం చేస్తున్నా.. చూస్తూ ఊరుకునేవారు కాదు. రాజధాని ఏపీ అంశం రాష్ట్ర పరిధిలోనిదేనని నాటకాలాడేవాళ్లు కాదని ఎక్కువ మంది అభిప్రాయం. అయితేఇప్పుడు మాత్రం అమరావతిని ఉద్దరించేది తామే నంటూ రంగంలోకి దిగారు. మన అమరావతి బీజేపీ సంకల్పయాత్ర పేరుతో భారతీయ జనతాపార్టీ పాదయాత్ర చేసి.. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులు, చేస్తున్న పనులపై ప్రచారం ప్రారంభించింది.
కేంద్రం రాజధాని అమరావతి కోసం 4వేలకోట్లు ఓసారి, 2500కోట్లు మరోసారి నిధులు ఆనాడు కేంద్రం మంజూరు చేసిందని గుర్తు చేశారు. అమరావతి స్మార్ట్ సిటీ కోసం ఈ డబ్బుల వినియోగించలేదని సోము వీర్రాజు చెబుతున్నారు. ఎప్పుడూ టీడీపీతో పొత్తు అనే మాటే రానీయరు వీర్రాజు. కానీ ఈ సారి అంత కంటే ఎక్కువగానే ఊహిస్తున్నారు. బీజేపీతో కలిస్తే వైసీపీ అధికారంలోకి రాదంటున్నారు. కారణం ఏదైనా సోము వీర్రాజు మాటల్లో స్పష్టత కనిపిస్తోంది. ప్రజాభిప్రాయం మారిపోయిందని ప్లేటు ఫిరాయిస్తున్నారో లేకపోతే.. ఇంకదైనా రాజకీయం ఉందో వారికే తెలియాలి.