దేశమంతా మరోసారి మోడీకి బ్రహ్మరథం పట్టినా… ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఖాతా తెరవలేకపోయింది. విభజన చట్టంలోని అంశాలతోపాటు, ఇచ్చిన హామీలను దాదాపు 85 శాతం అమలు చేశామని చాటి చెప్పిన భాజపా నాయకులు… ఏపీలో తమ ఉనికి కాపాడుకోలేకపోయారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భాజపా నేత సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రాలో టీడీపీకి 30 సీట్లకు మించి రావని తాను చాలాసార్లు చెప్పానన్నారు. నాయకుడు అనేవారికి ఒక సొంత ముద్ర ఉండాలనీ, మోడీకి అలాంటి సొంత ఇమేజ్ ఉంది కాబట్టే ఘన విజయం సాధించారన్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా తనదైన శైలితో వ్యవహరించారు కాబట్టే గెలిచారన్నారు. చంద్రబాబు నాయుడుకి అదే లేదన్నారు.
తెలుగుదేశం పార్టీ వల్ల భాజపా తీవ్రంగా నష్టపోయిందని చెబుతూనే, జనసేన పార్టీని కూడా అదే తరహాలో ఆ పార్టీయే ముంచిదని వీర్రాజు వ్యాఖ్యానించారు. గడచిన నాలుగు సంవత్సరాలుగా ఆంధ్రాలో నెలకొన్న అరాచక పరిస్థితులను ప్రజలు మౌనంగా భరిస్తూ వచ్చారనీ, ఈ పరిస్థితులను జగన్ తనకు అనుకూలంగా మార్చుకున్నారన్నారు. ఏపీ ఎన్నికల్లో భాజపా తనవంతు పాత్ర పోషించిందనీ, ఏం చెయ్యాలో అదే చేసిందని సోము వీర్రాజు అన్నారు.
వాస్తవానికి, 2014 ఎన్నికల్లో కూడా మోడీ హవా బాగా ఉన్నప్పుడు… ఏపీలో పొత్తులో భాగంగా కొన్ని సీట్లను ఆ పార్టీ గెలుచుకుంది. కానీ, గడచిన ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా సొంతంగానే బరిలోకి దిగింది. రాష్ట్రానికి చాలా చేశామని, కాబట్టి రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ప్రజలు తమను ఆదరిస్తారంటూ సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ వంటివారు తీవ్రంగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. కానీ, ఏపీ ప్రజలు మరోసారి భాజపాని సీరియస్ గా తీసుకోలేదు అనేది స్పష్టమైంది. ఒకవేళ, వారు చెప్పినట్టే… ఆంధ్రాకి గత కేంద్ర ప్రభుత్వం చాలా చేసిందని ప్రజలు కాస్తైనా నమ్మి ఉంటే… ఆ ప్రభావం ఎక్కడో చోట ప్రతిఫలించాలి కదా! ఇంకోటి… వీర్రాజు మాటల్లో జనసేన ఓటమి పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మనం టీడీపీ వల్ల నష్టపోయిన పార్టీలం అనే అభిప్రాయాన్ని తీసుకొచ్చే విధంగా మాట్లాడారు. నిజానికి, జనసేన తొలిసారిగా ఎన్నికల్లో పోటి చేసిందే ఈసారి. వామపక్షాలతో తప్ప, ఇతరులతో పొత్తులకే జనసేనాని ప్రయత్నించలేదు. ఆ లెక్కన, ఇతర పార్టీల వల్ల జనసేన నష్టపోయింది అంటూ ఏముంటుంది..?