భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. దూకుడు మీద ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపడుతామంటున్న ఆయన తమ బలం ఎంత ఉందో… క్రమంగా చూపించాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో తన ఆలోచనలు చెప్పారు. అందులో ఒకటి.. తిరుపతి నుంచి లోక్సభ ఉపఎన్నికల బరిలో నిలవడం. ఇటీవలే.. తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మరణించారు. అక్కడ ఉపఎన్నిక జరగాల్సి ఉంది. అక్కడ పోటీ చేసి.. బలం నిరూపించాలని సోము వీర్రాజు పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు తన ఆలోచనను.. పార్టీ నేతల ముందు ఉంచారు.
తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీకి కొంచెం చెప్పుకోదగిన చరిత్ర ఉంది. తెలుగుదేశంతో పొత్తు ఉన్నప్పుడల్లా.. ఆ సీటు బీజేపీకే వెళ్లేది. అక్కడి నుంచి ఎన్ . వెంకటస్వామి ఓ సారి బీజేపీ తరపున టీడీపీ మద్దతుతో ఎంపీగా గెలిచారు. 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీకి ఆ సీటు దక్కింది. కొద్ది తేడాతో ఓటమి పాలయింది. 2009లో మాత్రం విడిగా పోటీ చేసి ఇరవై వేల ఓట్లు తెచ్చుకోగలిగింది. తిరుపతి పార్లమెంట్ పరిధిలో తమకు బాగా క్యాడర్ ఉందని.. బీజేపీ నమ్మకం. అందుకే బలం నిరూపించుకోవడానికి ఇదో గొప్ప అవకాశంగా భావిస్తున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఖాళీగా ఉన్న అన్ని పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు పెడతామని ఎ్నికల సంఘం ఇటీవల క్లారిటీ ఇచ్చింది. ఆ ప్రకారం.. మరో రెండు నెలల్లో ఎన్నికలు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికలపై వైసీపీ, టీడీపీ ఇంకా ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. నిర్ణయాలు తీసుకోలేదు. సాధారణంగా సిట్టింగ్ సభ్యుడు చనిపోయినప్పుడు వారి కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇస్తూ ఉంటారు. అలా చేస్తే వేరే పార్టీ పోటీ పెట్టదు. ఇప్పుడు టీడీపీ ఏం చేస్తుందన్నది ఇంకా క్లారిటీ రాలేదు.